- ధర్మయుద్ధం ఇప్పుడే మొదలైంది
- ఉద్యోగులు భయపడొద్దు
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
- కరీంనగర్జిల్లా జైలు నుంచి విడుదల
సామాజిక సారథి, కరీంనగర్: ‘ధర్మయుద్ధం ఇప్పుడే మొదలైంది. కేసీఆర్నీ గొయ్యి.. నువ్వే తవ్వుకుంటున్నావ్..’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా హెచ్చరించారు. తెలంగాణ సమాజాన్ని దోచుకుంటున్న సీఎం కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రకటించారు. వేల కోట్లు దోచుకుని అవినీతి కుబేరులుగా మారారని, ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా జైలుకు పంపుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్అధికారంలో ఉంటే.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. కాగా, ఈనెల 3న ఉద్యోగ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి జీవోనం.317ను సవరించాలని డిమాండ్‌చేస్తూ బండి సంజయ్కరీంనగర్ లోని తన క్యాంపు ఆఫీసులో జాగరణ దీక్ష చేపట్టారు. అనుమతి లేదని పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు.
బండి సంజయ్ ను అరెస్టు చేసిన తీరును తప్పుబట్టిన హైకోర్టు వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆయన బుధవారం కరీంనగర్జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. కేంద్ర సహాయమంత్రి భగవంత్ కుభాతో కలిసి బయటికి వచ్చారు. జైలు వద్దకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్మీడియాతో మాట్లాడారు. జీవోనం.317ను సవరించాలని మరోసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని, ఉపాధ్యాయులు, ఉద్యోగుల కోసమే జైలుకు వెళ్లానని ప్రకటించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దీక్ష చేస్తుంటే బీజేపీ ఆఫీసును ధ్వంసం చేశారని పేర్కొన్నారు. కార్యకర్తలపై దాడిచేసి తనను అరెస్టు చేసి రాక్షస ఆనందం పొందుతున్నారని దుయ్యబట్టారు. తాను జైలు వెళ్లితే బయటికి రావాలని కోరుకున్నారని.. నీవు వెళితే రావొద్దనే ప్రజలు అనుకుంటున్నారని సీఎం కేసీఆర్ను ఉద్దేశించి అన్నారు.
పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు
ఉద్యోగులు భయపడొద్దని, హక్కుల కోసం పోరాడండి మీకు అండగా బీజేపీ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉద్యోగ సంఘాల నాయకులను నమ్మొద్దని కోరారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జీవోనం.317ను సవరించకపోతే, అవసరమైతే మరోసారి జైలుకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు. ఉద్యోగాలు పోతే అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తమదేనని ప్రకటించారు. జైల్లో ఉండగా తనకు సంఘీభావం తెలిపి, అండగా నిలిచిన బీజేపీ కేంద్ర నాయకత్వానికి, పార్టీ నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.