Breaking News

హత్య కేసును ఛేదించిన పోలీసులు

హత్య కేసును ఛేదించిన పోలీసులు

సామాజిక సారథి,పెద్ద శంకరంపేట: తన భర్త పెట్టే వేధింపులు తాళలేక అతని భార్య, కూతురు, మరో వ్యక్తితో, కలిసి భర్తను హతమార్చినట్లు అల్లాదుర్గం సీఐ జార్జి, పేట ఎస్ఐ నరేందర్ తెలిపారు. శనివారం పెద్దశంకరంపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గత నెల 29న రాత్రి మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన ఎరుకల వెంకయ్య (40)అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదైందన్నారు. ఈ కేసును ఛేదించి విచారించగా కట్టుకున్న భార్య, కూతురు, మరో వ్యక్తి సహాయంతో ఎరుకల వెంకయ్యను హత్య చేసినట్లు తేలిందన్నారు. ఈనెల 29న మధ్యాహ్నం మల్కాపురం నుండి దవాఖాన నిమిత్తం మృతుడి తో పాటు భార్య, కూతురు, వడ్డె మల్లయ్య, కలిసి పెద్ద శంకరంపేటకు వచ్చి కల్లు దుకాణంలో కల్లు సేవించడంతో పాటు వైన్స్ లో మద్యం సేవించి మరికొంత మద్యం వెంట తీసుకెళ్లారు. మృతుడు వెంకయ్యను వెంట తెచ్చుకున్న తాడుతో గొంతు బిగించి ముగ్గురు కలిసి వెంకయ్యను హత్య చేశారు. ఈ హత్య కేసు తమ మీద రాకుండా ఉండేందుకు మృతుడి పంచతో దగ్గరలోని విద్యుత్ హై టెన్షన్ స్తంభానికి ఉరివేసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించారు. మృతుడి తండ్రి నాగయ్య తన కుమారుడు అనుమానాస్పదంగా మృతి చెందాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసును విచారించి హత్య చేసిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని ఇద్దరినీ జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించడంతో పాటు 11ఏండ్ల మైనర్ బాలికను జువైనల్ హోంకు తరలించామని పోలీసులు పేర్కొన్నారు.