Breaking News

ఖద్దరు నీడన ఖాకీలు..!

ఖద్దరు నీడన ఖాకీలు..!

  • నాగర్​ కర్నూల్​ జిల్లాలో పలువురు ఎస్సైల తీరు వివాదాస్పదం
  • రాజకీయ పలుకుబడితో పోస్టింగులు
  • చిన్న చిన్న కారణాలకు సామాన్యులకు చావుదెబ్బలు
  • న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తున్న ప్రజలు
  • తాజాగా వంగూరు ఎస్సైపై అట్రాసిటీ కేసుపెట్టాలని న్యాయస్థానం ఆదేశాలు

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లాలో చట్టం, న్యాయం అధికారపార్టీ నాయకులకు చుట్టంగా మారుతోంది. అధికారపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల, బడానేతల అండదండలతో తాము కోరుకున్న పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్ లు పొందుతున్న కొందరి ఎస్సైల వ్యవహారశైలి వివాదాస్పదమవుతోంది. తమకు పోస్టింగ్ ఇప్పించినవారి సేవలో తరించడమే కాదు వారు కనుసైగ చేస్తే చాలు తప్పుడు కేసులతో పాటు సామాన్యులకు పోలీస్ మార్క్​ టెస్టీ​ చూపిస్తున్నారు. తమ స్టేషన్ల పరిధిలో తప్పు చేసినోడు మనోడని అధికారపార్టీ ప్రజాప్రతినిధులు చెబితేచాలు చట్టంలోని అన్ని లొసుగులను వెతికి ఈజీగా తప్పిస్తున్నారు. తప్పు చేసినోళ్లను ఎస్సైలు తప్పిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని ఇక్కడి ఏఎస్పీ, ఎస్పీలకు ఫిర్యాదులు చేసినా బాధితులకు భరోసా కనిపించడం లేదు. అధికారపార్టీ నేతల అండ చూసుకుని రెచ్చిపోతున్న ఎస్సైలపై చర్యలు తీసుకోవాలని ఏకంగా ప్రజలు కోర్టులను ఆశ్రయించాల్సిన దుస్థితి వచ్చింది. తాజాగా వంగూరు ఎస్సైపై కేసు పెట్టాలని కోర్టు ఆదేశించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

అక్రమదందాల్లో వాటాలు?

నాగర్ కర్నూల్ జిల్లాలో కొందరు పోలీసులు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే డ్యూటీలు చేస్తుండటం పోలీస్ శాఖకే మాయనిమచ్చ తెచ్చి పెడుతోంది. అధికారపార్టీ అండ ఉంటే తమ ప్రమోషన్లతో పాటు ఏ తప్పులు చేసినా తప్పించుకోవచ్చన్న ధీమాతో కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని ఏ పోలీస్ స్టేషన్ లోనైనా వారి ఆదేశాలతోనే ఎఫ్ఐఆర్ లు నమోదు చేయాలని ఒత్తిడి వస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు ఇసుక దందా, మట్టిదందా, రేషన్ బియ్యం దందా ఇలా అన్నీ ఇల్లీగల్ పనులకు పోలీసులను దర్జాగా వాడుకుంటున్నారు. పోలీసులు సైతం అక్రమదందాలకు సహకరించడంతో పాటు తాము కూడా అవినీతి సొమ్ము వాటాలు పంచుకుని అక్రమదందాల్లో తమవంతు పాత్ర పోషిస్తున్నారనే అపవాదు ఉంది.

జిల్లాలో మారని ఎస్సైల తీరు


నాగర్ కర్నూల్ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో కొందరు ఎస్సైల వ్యవహారశైలి వివాదాస్పదంగా మారుతోంది. పోలీస్ అధికారులు సైతం సైలెన్స్ గా ఉండటంతో కొందరు బాధితులు న్యాయం కోసం ఏకంగా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. న్యాయం కోసం ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. వంగూరు ఎస్సై కురుమూర్తి అరాచకాలపై బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో అదే పోలీస్ స్టేషన్లో ఎస్సైపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసునమోదు చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తెలకపల్లి ఎస్సై ప్రదీప్ కుమార్ రామగిరికి చెందిన శ్యామ్ ను అక్రమంగా పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయి చితకబాదడంతో పాటు తప్పుడు కేసులు పెట్టాడని హైకోర్టులో ఫిర్యాదుచేశాడు. తిమ్మాజిపేట ఎస్సై శంషోద్దిన్​ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాధవ్ అనే వ్యక్తిని బట్టలు ఊడదీసి విచక్షణరహితంగా కొట్టి చిత్రహింసలకు గురిచేశాడని హైకోర్టులో కేసువేశాడు. నాగర్ కర్నూల్ ఎస్సై విజయ్ కుమార్ ఓ కేసులో ఏకంగా యాక్సిడెంట్ చేసిన వాహనాన్ని తారుమారు చేసి మరో వెహికిల్​ ను కోర్టుకు చూపించడంతో పాటు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన తీరుపై చర్యలు తీసుకొవాలని కోర్టును ఆశ్రయించడంతో పాటు జిల్లా ఎస్పీ, డీజీపీ దాకా పలువురు ఫిర్యాదులు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోవడం లేదు. తాడూరు ఎస్సై శ్రీనివాసులు కేవలం పోలీస్ స్టేషన్ కు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు మాత్రమే రావాలని ఇతరులు వస్తే తోలు తీస్తానని బీఎస్పీ నేతలను బెదిరించిన సంఘటన ఇటీవల జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొల్లాపూర్ లో ఎస్సై బాలవెంకటరమణ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వారిని స్టేషన్ కు తీసుకొచ్చి చితకబాదడమే ఆయన వంతు అయింది. పలువురిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన సంఘటనలు ఉన్నాయి. అప్పట్లో సాక్షాత్తు మాజీమంత్రి జూపల్లి కృష్ణారావును కూడా స్టేషన్ కు రానివ్వకుండా వార్నింగ్ ఇచ్చిన సంఘటన జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పెద్దకొత్తపల్లి ఎస్సై రాము యాదవ్ జొన్నలబొడుగలో బీఆర్ఎస్ నేతలు వేస్తున్న సీసీరోడ్లను నాణ్యత లేదని ప్రశ్నించిన బీఎస్పీ నేతలను స్టేషన్ కు తీసుకుపోయి విష్ణు అనే కార్యకర్తను చితకబాదినా అడిగేవారు కరువయ్యారు. చిన్నంబావి, అచ్చంపేట, అమ్రాబాద్, పదర, బల్మూర్​, ఉప్పునుంతల పోలీస్ స్టేషన్లో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలకు అనుకూలంగా ఏ ఒక్కరూ పనిచేసినా వారిపై అక్రమ కేసులు పెడతామని బహిరంగంగానే బెదిరిస్తున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. నాగర్​ కర్నూల్​ జిల్లాలో పోలీసుశాఖకు మచ్చరాకముందే ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, సామాన్య పౌరులు కోరుతున్నారు.