Breaking News

వైద్యరంగంలో తెలంగాణ అగ్రగామి

  • వనపర్తిలో 180 పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రం
  • ఏడేళ్లలో 65 నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు పెంచాం
  • వైద్య ఆరోగ్యశాఖా మంత్రి హరీశ్ రావు
  • కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిరంజన్​రెడ్డి

సామాజిక సారథి, వనపర్తి : వైద్యరంగంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్టాన్న్రి నిలపడమే లక్ష్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో 180 పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రం, 20 పడకలతో నిర్మించిన నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రసూతి, నవజాత శిశు సంరక్షణలో రాష్టాన్న్రి దేశంలోనే అగ్రగామిగా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం మంత్రి నిరంజన్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం టీ డయాగ్నస్టిక్‌ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఏడేళ్లలో వైద్య రంగంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగిన అభివృద్ధిని హరీశ్‌ వివరించారు. రూ.407 కోట్లతో రాష్ట్రంలో 23 ఎంసీహెచ్‌ ఆసుపత్రులు మంజూరు చేసుకుని వాటిలో 13 కేంద్రాలను ప్రారంభించామని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం 18గా ఉన్న నవజాత శిశు సంరక్షణ కేంద్రాలను ఏడేళ్లలో 65కు పెంచామన్నారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద కొత్తగా 23 ఎస్‌ఎన్‌సీయూలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో రూ.1500 కోట్లతో మూడు ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేశామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అనంతరం పట్టణంలో సీసీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్​రెడ్డితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.