Breaking News

కర్దనూర్ ఎంఎస్ఎన్ పరిశ్రమలో ఉద్యోగి మృతి

సామాజిక సారథి, పటాన్‌చెరు: పటాన్‌చెరు మండలం కర్దనూర్ ఎంఎస్ఎన్ పరిశ్రమలో ఉద్యోగి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం రాత్రి విధినిర్వహణలో ఉన్న ప్రొడక్షన్ మేనేజర్ జగదీష్ (35) ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడన్నారు. వెంటనే పరిశ్రమ యజమాన్యం నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. ఈ మేరకు స్థానిక కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రొడక్షన్ సమయంలో విషవాయువుల వ్యాప్తివల్లే జగదీష్ మృతిచెందాడని మరో ఇద్దరు కార్మికులు సైతం అస్వస్థతకు గురయ్యారని సీఐటీయు జిల్లా కోశాధికారి నర్సింహారెడ్డి, ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ ఘటన యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే జరిగిందని, చికిత్స పొందుతున్న ఇద్దరి కార్మికులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు బాధిత కుటుంబాలకు రూ. 50లక్షల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమ యాజమాన్యం కార్మికులకు కార్మిక చట్టాలు అమలు చేయకుండా, కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతుందన ఆరోపించారు. ఈ ఘటనపై కార్మికశాఖ ఉన్నతాధికారులు, ఇన్స్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులందరితో ఉద్యమిస్తామని హెచ్చరించారు.