
- ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికే టికెట్
- హస్తం గూటికిచేరినా లభించని హామీ
- కల్వకుర్తిలో రసవత్తరంగా రాజకీయం
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ ఎన్ఆర్ఐ, ఐక్యతా ఫౌండేషన్ ఛైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆదిలోనే నిరాశే ఎదురైంది. దీంతో చేసేదిలేక దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. కాంగ్రెస్ అధిష్టానం కల్వకుర్తి టికెట్‌ను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి ఖరారుచేసింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. గతంలో ఆయన కల్వకుర్తి నుంచి పోటీచేద్దామని భావించినా బీఆర్ఎస్ టికెట్ రాలేదు. 2023 ఎన్నికల్లోనూ మరోసారి నిరాశే ఎదురుకావడంతో కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో ఆయనకు ‘హస్తం’ అధినాయత్వం టికెట్‌ను ఖరారుచేసింది. తాజా జాబితాలో ఆయన పేరు వెల్లడైంది. కాగా, కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి బాగా నమ్మకంతో ఉన్నారు. ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అంబులెన్స్ లను ఏర్పాటుచేసి పేదలు ఆస్పత్రులకు వెళ్లేలా సదుపాయం కల్పించారు. అలాగే కల్వకుర్తి, వెల్దండ, ఆమనగల్లు, మాడ్గుల మండల కేంద్రాల్లో పార్టీ ప్రచార కార్యాలయాలను ప్రారంభించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ద్వారా టికెట్ కోసం తీవ్రంగా యత్నించారు. అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో డీలాపడిపోయారు. కొద్దిరోజులుగా ఆయన సైలెంట్ అయిపోయారు. కాగా, ఎన్నికల వేళ ఆయనకు బీఆర్ఎస్ గాలం వేసినట్లు తెలిసింది. అయితే ఈ ఎన్నికల్లో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉండి కసిరెడ్డి నారాయణరెడ్డి గెలుపునకు పనిచేస్తారా? స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీచేస్తారా? లేదా ఇతర పార్టీలోకి మారుతారా? అన్నది కాలమే నిర్ణయించాలి.