Breaking News

సీసీఐ యూనిట్ ను ప్రారంభించండి

సీసీఐ యూనిట్ ను ప్రారంభించండి
  • అందుబాటులో 48 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ నిల్వలు
  • గిరిజనులను ఉపాధి దొరుకుతుంది
  • ​కేంద్రానికి మంత్రి కేటీఆర్ వినతి

సామాజిక సారథి, హైదరాబాద్: ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) యూనిట్‌ను తిరిగి ప్రారంభించాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పరిశ్రమ నిర్వహణకు అవసరమైన విశాలమైన 772 ఎకరాల ప్రాంగణంతో పాటు 170 ఎకరాల సీసీఐ టౌన్ షిప్ 1,500 ఎకరాల్లో సుమారు 48 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా రెండు కేవీఏ విద్యుత్‌ సరఫరా వ్యవస్థతో పాటు ఉత్పత్తికి సరిపడా నీటిలభ్యత కూడా ఉందన్నారు. భౌగోళికంగా ఆదిలాబాద్‌కున్న సానుకూలతను ఉపయోగించుకుని సీసీఐ యూనిట్‌ పునఃప్రారంభిస్తే తెలంగాణ అవసరాలకే కాకుండా మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడి సిమెంట్‌ సరఫరా చేసేందుకు వీలవుతుందన్నారు.

ఆదిలాబాద్​అభివృద్ధి చెందుతుంది

మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్‌ జిల్లాల్లో సీసీఐ తిరిగి తెరిస్తే ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుంని, గిరిజనులు, ఆదివాసీ యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్​పేర్కొన్నారు. రాష్ట్రంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఎస్‌ఐపాస్ వంటి అద్భుతమైన విధానం రూపొందించామని అన్నారు. నూతన పారిశ్రామిక విధానంతో రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయన్నాని వివరించారు. తమ ప్రయత్నాలు ఫలించి ఆదిలాబాద్‌ వంటి ప్రాంతాలకు సైతం నూతన పరిశ్రమలు వచ్చాయని పేర్కొన్నారు. ఇదే ఆదిలాబాద్ జిల్లాలో ఒరియంట్ సిమెంట్ తన దేవాపూర్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు సుమారు రూ.1,500 కోట్ల (215 మిలియన్ డాలర్లు) పైగా భారీ పెట్టుబడులు పెట్టిన విషయాన్ని కేంద్రం గుర్తించాలని మంత్రి కేటీఆర్​ఉద్ఘాటించారు. రాష్ట్రంలో నిర్మాణ రంగం దూకుడు మీద ఉందని, భవిష్యత్​లోనూ ఈ రంగం మరింత పురోగతి సాగిస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఇక్కడ సిమెంట్‌కు దీర్ఘకాలిక డిమాండ్ ఉండే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సీసీఐ కంపెనీ పునఃప్రారంభానికి తన వంతు ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం చేస్తూనే ఉందని, గతంలో పలుసార్లు ఈ విషయంలో కేంద్ర మంత్రులు అనంత్ గీతే, మహేంద్రనాథ్ పాండేలకు విజ్ఞప్తి చేశామని మంత్రి కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.