- రైతులకు సూచించిన సీఎం కేసీఆర్
- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తండ్రి మృతికి నివాళి
సామాజిక సారథి, జోగుళాంబ గద్వాల: గద్వాల పర్యటనలో భాగంగా గురువారం సీఎం కేసీఆర్ మార్గమధ్యంలో ఆగి మహేశ్వర్‌రెడ్డి, రాముడు అనే ఇద్దరు రైతులు సాగుచేసిన మినుము, వేరుశనగ పంటలను పరిశీలించారు. గింజనాణ్యత, రైతులు వాడుతున్న ఎరువుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరుతడి పంటలే వేయాలని సీఎం కేసీఆర్ రైతులకు సూచించారు. దీంతో రాజకీయ చీడ కూడా తొలగిపోతుందన్నారు. ఆరుతడి పంటల వల్ల భూసారం కూడా పెరగడంతో పాటు అధిక దిగుబడి వస్తుందని వారికి సూచించారు. వానాకాలంలో వరి వేసుకుని, యాసంగిలో ఆరుతడి పంటలు వేసుకోవాలని కోరారు. పంటల సాగుపై కూడా దారిద్ర్యపు రాజకీయాలు చేస్తున్నారని, యుద్ధాలే జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తంచేశారు.
ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కుటుంబానికి పరామర్శ
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తండ్రి వెంకట్రామ్రెడ్డి ఇటీవల కన్నుమూశారు. ఆయన కుటుంబసభ్యులను సీఎం కె.చంద్రశేఖరరావు పరామర్శించేందుకు హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో గద్వాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వెంక్రటామ్ రెడ్డి చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే కుటుంబసభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. సీఎం కేసీఆర్‌వెంట మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, వీఎం అబ్రహం, మర్రి జనార్ధన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జి.జైపాల్ యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.