Breaking News

కోటి రూపాయల ఆదాయం వచ్చే పంటలు చూపించండి సార్​

కోటి రూపాయల ఆదాయం వచ్చే పంటలు చూపించండి సార్​

సామాజిక సారథి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్న విషయం తెలిసిందే. నీవంటే నీవే అంటూ వేలెత్తిచూపుకుంటున్నాయి. యాసంగి సంగతి అటుంచింతే వానాకాలంలో చేతికొచ్చిన ధాన్యం కొనే దిక్కులేదు. కల్లాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం వద్ద రైతులు పడిగాపులు గాస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వడ్లు మొలకెత్తడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమను ఆదుకునే దిక్కు ఎవరని గగ్గోలుపెడుతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. కేంద్రం వద్దంటే యాసంగిలో ధాన్యం కొనలేమని ఇటీవల సీఎం కేసీఆర్​చెప్పిన విషయం తెలిసిందే. రైతుల దైన్యంపై బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ​డాక్టర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్​ స్పందించారు. ఆయన తాజాగా చేసిన ట్విట్​పాలకుల్లో కాకపుట్టిస్తోంది.

‘‘ముఖ్యమంత్రి కేసీఆర్​ గారు, మీ ఫామ్ హౌస్ లో పండించే పంటలు తెలంగాణ రైతులకు మీడియా సమావేశంలో చెప్పి, జర చూపించండి. మీ ఫామ్ హౌస్ లో పండించే పంటలకు ఎకరానికి కోటి రూపాయల ఆదాయం వస్తుందని గతంలో మీరే చెప్పారు కదా!. సార్, యాదుందా? కోటి ఎకరాల తెలంగాణ మగాణి భూముల్లో మీ ఫామ్ హౌస్ లో వేసే పంటలనే రైతులు పండిస్తారు. పేదరైతులందరు మీలాగే కోటేశ్వరులవుతారు. ఇక రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఉండవ్. రైతుబంధు, రైతుబీమా పైసలు చెల్లించాల్సిన అవసరం రాదు.’’ అని డాక్టర్ ​ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్ సూచించారు.

‘‘తెలంగాణలో ఎక్కడ చూసినా రోడ్లపై, కల్లాల్లో ధాన్యం కుప్పలు, భయంతో దిక్కుతోచక వరిని కొనే వారికోసం ఎదురుచూస్తున్న పేద రైతు కుటుంబాలే కనిపిస్తున్నవి. రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు డ్రామాలు బంద్​పెట్టి అర్జంట్​గా వరి కొనుగోలుపై ఒక నిర్ణయానికి రాలేకపోతే చరిత్రహీనులైతరు జాగ్రత్త!”అంటూ హెచ్చరించారు.