Breaking News

కాల్చొద్దు.. కలియ దున్నుదాం

కాల్చొద్దు.. కలియ దున్నుదాం

  • పంటల వ్యర్థాలను దున్ని భూసారం పెంచవచ్చు
  • పొలాల్లో నిప్పుతో పంటకు ముప్పే
  • అవగాహన లేక వరిగడ్డి, పత్తిలొట్టను కాలుస్తున్న రైతులు
  • హాని కలుగుతుందంటున్న వ్యవసాయ నిపుణులు

వరి కోతల తర్వాత రైతులు వరి పండించిన మడులలో ఉన్న వరి గడ్డిని మంటపెడుతుంటారు. దీంతో నేలకు సారాన్ని ఇచ్చే క్రిమికీటకాలు చనిపోవడంతో పాటు భూసారం సమతుల్యత దెబ్బతిని తద్వారా సాగుచేసే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వరి గడ్డిని కాల్చివేయకుండా భూమిలోనే కలియ దున్నితే ప్రయోజనకరంగా ఉంటుందని వ్యవసాయరంగ నిపుణులు, అగ్రికల్చర్ సైంటిస్టులు సూచిస్తున్నారు.

సారథి, రామాయంపేట: వరి కోతలు పూర్తి కావడంతో రైతులు వారి వారి పొలాల్లోని వరి గడ్డిని కాలుస్తున్నారు. ఇది పర్యావరణానికి ముప్పుగా మారింది. వరిగడ్డిని కాల్చడం ద్వారా భూమిలోని మిత్ర పురుగులు, వానపాములు చనిపోతాయి. సేంద్రియ పదార్థాలు దెబ్బతింటాయి. క్లోరోఫ్లోరో కార్బన్ రిలీజై భూ భౌతిక పరిస్థితుల్లో మార్పులు రావడంతో పాటు పంట దిగుబడి పైన ప్రభావం చూపిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా పొలాల్లో మంటలు పెట్టవద్దని(వరి గడ్డిని, పత్తిలొట్టలను కాల్చకూడదని) చెబుతున్నా రైతులకు సరైన అవగాహన కల్పించేవారు లేరు. ప్రస్తుతం ఎండాకాలం వరి కోతలు పూర్తయి.. దుక్కులు దున్ని జీలుగా, జనుము వేసే రైతులు వారి పొలాల్లోని వరి గడ్డిని అంటిపెడుతుంటారు. గతంలో రైతులు వరి గడ్డిని పశువుల మేతకు ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు గ్రామాల్లో పశువుల సంఖ్య తగ్గిపోవడంతో రైతన్నలు పంట పొలాల్లో వరి గడ్డిని కాల్చివేస్తున్నారు.
కాల్చితే యమడేంజర్
పొలంలోని వరి గడ్డిని కాల్చడం వలన క్లోరోఫోరో కార్బన్ విడుదల అవుతుందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. వరి పండిస్తున్న ప్రాంతాల్లో మిథేన్ గ్యాస్ రిలీజ్ కావడంతో పాటు రైతులు వరి గడ్డి, పత్తి కట్టెను కాల్చడం ద్వారా మరింత ప్రభావం చూపుతుందంటున్నారు. పొలంలో ఉన్న వాటిని కాల్చే సమయంలో మంటలు ఒక చోట నుంచి మరొక చోటుకు వ్యాపించి ఆస్తినష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి.
నష్టాలు ఇవే
నేలలో కలిసిపోయే సేంద్రియ కర్బనం తగ్గిపోవడమే కాకుండా అది కార్బన్ డయాక్సైడ్ రూపంలో గాల్లో కలిసి పోయి విషపూరిత కేన్సర్ కారకాలుగా మారుతాయి.పంటకు ఉపయోగపడే సూక్ష్మపోషకాలు జింక్, ఐరన్, కాపర్, మాంగనిస్, స్థూలపోషకాలు (నత్రజని, భాస్వరం, పోటాష్) నేలలో కలిసిపోయే ప్రక్రియ ఆగిపోతుంది. ఆలస్యంగా కోతకు వచ్చే పంటలు, కల్లాల దగ్గర ఉన్న ధాన్యం కాలిపోయే ప్రమాదం ఉంది.
ప్రయోజనాలు ఇవే
వ్యర్థాలను తగలకుండా యూరియా తో కలిపి మాగబెట్టి పోషక విలువలు పెంచి పశువుల మేతగా వాడవచ్చు. మొదళ్లను పొలంలో కలియదున్నినట్లైతే నేలలో కార్బన్, నత్రజని శాతం పెరుగుతుంది.ఈ ప్రక్రియ వల్ల నేలలో సేంద్రియ కార్బన్లు 14-27శాతం పెరుగుతుంది. ఇలా చేస్తే ఒక ఎకరాకు ఒక టన్ను ఎరువు తయారవుతుంది. దిగుబడి 5 నుంచి10 శాతం పెరిగే అవకాశం ఉంటుంది.ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న హ్యాపీ సీడ్ డ్రిల్లర్, హ్యాపీ సీడర్ వంటి యంత్రాలతో పొలంలోని గడ్డి తొలగించకుండానే మొక్కజొన్న, జొన్న ఇతర పంటలను విత్తుకోవచ్చు. వానపాముల ఎరువు తయారీలోను ఉపయోగించుకోవచ్చు.
అవగాహన కల్పిస్తేనే మేలు
పర్యావరణ పరిరక్షణతో పాటు భూ భౌతికస్థితి గతులను రక్షించడానికి సెంట్రల్ గవర్నమెంట్ గతంలో పంట పొలాల్లో మంటలు వేయరాదని ప్రత్యేక ఆదేశాలు జారీచేసింది. ఈ ఉత్తర్వులను రాష్ట్రలు అగ్రికల్చర్ ఆఫీసర్లతో అమలు చేయించాలని అందులో పేర్కొంది. అగ్రికల్చర్ ఆఫీసర్లు వాటి గురించి రైతులకు అవగాహన కల్పించడం లేదని కొందరు చెబుతున్నారు. దీంతో రైతులు ఎప్పటిలాగే పంట కోత కోసిన తర్వాత మిగిలిన వరి గడ్డిని పొలంలోనే కాల్చివేస్తున్నారు.