- అటు విమర్శలు.. ఇటు రాజీనామాలు
- ఢిల్లీలో రైతులకు ప్రకటించిన సాయం తిరస్కరణ
- టీఆర్ఎస్కు తలబొప్పి కట్టిన తాజా పరిణామాలు
- బీజేపీకి టీఆర్ఎస్ బీ టీమ్ అంటూ టికాయత్విమర్శలు
- కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, సీనియర్నేత గట్టు రామచందర్రావు రాజీనామా
- ఉద్యమకారులకు పార్టీలో గౌరవం లేదని లేఖలు
సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: కారు.. సారుకు ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదిగా కాలంగా జరుగుతున్న రైతు ఉద్యమంలో అసువులు బాసిన 700 మంది రైతన్నల కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయం ప్రకటించిన విషయం తెలిసిందే. దాన్ని తిరస్కరించిన రైతు నేతలు గురువారం హైదరాబాద్లోని నిర్వహించిన రైతు సంఘాల మహాధర్నాలో టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. ఇదేరోజు టీఆర్ఎస్‌లో కీలక నేతలుగా ఉన్న కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, ఖమ్మం జిల్లా సీనియర్ నేత గట్టు రామచందర్రావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ పరిణామాలు ఆ పార్టీకి తలబొప్పి కట్టిందని చెప్పొచ్చు. సీఎం కేసీఆర్‌పై భారత కిసాన్ యూనియన్(బీకేఎస్) ప్రతినిధి రాకేశ్టికాయత్ సంచలన విమర్శలు చేశారు. ఢిల్లీ రైతు ఉద్యమానికి మద్దతుగా ఇందిరాపార్క్ వద్ద విపక్ష పార్టీలు, రైతు సంఘాలు మహాధర్నా నిర్వహించాయి. ఈ ధర్నాకు టికాయత్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బీజేపీకి టీఆర్ఎస్ బీ పార్టీ’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి కొమ్ముకాసే టీఆర్ఎస్‌ను ఢిల్లీకి పంపించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని టికాయత్ డిమాండ్ చేశారు. తెలంగాణ ధాన్యం కొనుగోలు చేసే వరకు రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రైతు ఉద్యమం ఒక ప్రాంతానిది కాదని, పంటలకు మద్దతు ధర ప్రకటించే వరకు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. పంటకు ఎమ్ఎస్పీ గ్యారంటీ కార్డ్ వచ్చే వరకు పోరాడుతామని టికాయత్పునరుద్ఘాటించారు.
కీలక నేతల రాజీనామా
మరోవైపు టీఆర్ఎస్ పార్టీకి భారీషాక్ తగిలింది. సీనియర్ నేత గట్టు రామచందర్ రావు రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖను సీఎం కేసీఆర్‌కు పంపించారు. ‘మీ అభిమానం పొందడంలో, గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలం అయ్యాను’అని లేఖలో గట్టు పేర్కొన్నారు. మీరు ఆశించిన స్థాయిలో తాను పార్టీలో రాణించలేకపోయానని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కరెక్ట్కాదని తాను భావించానన్నారు. అందుకే టీఆర్‌ఎస్, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. ఇంతకాలం పార్టీలో తనకు బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
మాజీ మేయర్ రవీందర్ సింగ్ లేఖ
‘ఉద్యమకారుల పరిస్థితి చూసి కన్నీళ్లు వచ్చినా.. తెలంగాణ అభివృద్ధి పేరిట అన్ని భరిస్తూ వచ్చాం. ఉద్యమ ద్రోహులకు అందలమెక్కిస్తూ.. ఉద్యమకారులకు అవమానాలు చేస్తుంటే బాదేస్తోంది. కరీంనగర్ జిల్లాలో కొందరి చేతిలో టీఆర్ఎస్ పార్టీ బందీ అయినా పట్టించుకోవడం లేదు. ఇలాంటి విషయాలన్నీ మీకు చెబుతామంటే కనీసం సమయం కూడా ఇవ్వడం లేదు. కరీంనగర్ జిల్లాలో పార్టీని భ్రష్టుపటిస్తూ, అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా మీరు పట్టించుకోవడం లేదు. అధికారం రాకముందు మీరు ఉద్యమకారులను ఎలా గౌరవించేవారో.. అధికారం వచ్చాక వారి పరిస్థితి ఏమిటో ఓ సారి గుర్తు చేసుకోండి. టీఆర్ఎస్ పార్టీలో నిజమైన ఉద్యమకారులకు స్థానం, గౌరవం లేదని గుర్తించి పార్టీకి రాజీనామా చేస్తున్నా. ఇంతవరకు ఆదరించిన మీకు ధన్యవాదాలు’ అంటూ కరీంనగర్మాజీ మేయర్ రవీందర్ సింగ్ లేఖను ముగించారు. మొత్తానికి మొత్తంగా గురువారం కేసీఆర్ పై ఓ వైపు విమర్శలు, మరోవైపు రాజీనామాల పరంపర కొనసాగింది. ఒకేరోజు జరిగిన పరిణామాలు పొలిటికల్జంక్షన్లో తీవ్రచర్చకు దారితీశాయి.