Breaking News

హమాలీలకు ఆర్ఎస్పీ కొత్త భరోసా

హమాలీలకు ఆర్​ఎస్పీ భరోసా

సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: ఆరేళ్ల సర్వీస్​ఉండగానే తన అత్యున్నత ఐపీఎస్ ​ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ రంగప్రవేశం చేశారు డాక్టర్ ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్. అన్నివర్గాలను సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆటోడ్రైవర్లు, చేతివృత్తులవారు, చేనేత కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా అందరి బాధసాధకాలను తెలుసుకుంటున్నారు. వారందరినీ పేదరికంలో పెట్టివేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. 70 ఏళ్లలో అన్ని వర్గాలు అభివృద్ధికి దూరమైన తీరును గుర్తుచేస్తూనే.. బహుజన రాజ్యం ఆవశ్యకతను వివరిస్తున్నారు. తాజాగా బుధవారం ఆయన నల్లగొండ జిల్లా నార్కట్ పల్లిలోని ఐకేపీ వరి కొనుగోలు కేంద్రంలో హమాలీలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. వడ్ల బస్తాలను మోసి… వారు నిత్యం పడుతున్న కష్టాలను తెలుసుకున్నారు. తమ ఇబ్బందులను హమాలీలు ఏకరువు పెట్టారు. బహుజన రాజ్యం వస్తేనే అందరి బతుకులు మారుతాయని భరోసా ఇచ్చారు. యాసంగిలో రైతులు వడ్లు వేస్తే ఉరే అన్న గతి తీసుకొచ్చేలా కేసీఆర్ సర్కార్, కేంద్రంలో బీజేపీ వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. యాసంగిలో వడ్లు కొనలేమని ప్రభుత్వం చెబుతున్నా వరికి ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేయాలో చెప్పడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరలు, ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని డాక్టర్​ ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్ ​డిమాండ్ చేశారు.