Breaking News

కారు డ్రైవరా.. మజాకా!

కారు డ్రైవరా.. మజాకా!

  • బైక్ ను అతివేగంతో ఢీకొట్టిన కారు
  • అడ్డొచ్చినవారిపైకి దూసుకెళ్లిన డ్రైవర్​
  • ఒకరి దుర్మరణం, ఇద్దరి పరిస్థితి విషమం
  • చెట్లమాటున కారును వదిలేసి పరారీ

సారథి, వెల్దండ: కారు డ్రైవర్​ అతివేగం, నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.. మరో ఇద్దరిని చావు అంచులదాకా తీసుకెళ్లింది.. హైవేపై జెట్​స్పీడ్​తో వస్తున్న కారు మొదట బైక్​ను ఢీకొట్టడంతో దానిపై ఉన్న ఇద్దరు గాల్లోకి ఎగిరిపడ్డారు.. ఓ వ్యక్తి కారును ఆపేందుకు ప్రయత్నించగా అతని కూడా ఢీకొట్టడంతో ఎగిరి అవతలపడ్డాడు.. ఎక్కడ దొరికిపోతానోనని వాయువేగంతో తీసుకెళ్లి ఊరు చివరన పొలాల్లో చెట్లమాటున డ్రైవర్​ కారును వదిలేసి పరారయ్యాడు.. సినిమా సీన్​ను తలపించిన ఈ రియల్ ​క్రైమ్ బుధవారం నాగర్​కర్నూల్ ​జిల్లా శ్రీశైలం– హైదరాబాద్ ​ప్రధాన రహదారి వెల్దండ చౌరస్తాలో చోటుచేసుకుంది. బాధితులు, స్థానికులు, పోలీసుల కథనం.. వెల్దండ మండలం పెద్దపూర్​ పంచాయతీ పరిధిలోని గొల్లొనిపల్లికి చెందిన కొందరు వడ్డెర కులస్తులు గ్రామశివారులో బండను కొట్టుకోనివ్వడం లేదని, అనుమతి ఇచ్చి ఉపాధి చూపాలని తమ సమస్యలను చెప్పుకునేందుకు స్థానిక తహసీల్దార్​ ఆఫీసుకు వచ్చారు. తహసీల్దార్​కు వినతిపత్రం ఇచ్చిన అనంతరం పేపర్​ తీసుకొచ్చేందుకు బైక్​పై వెంకటేశ్(38), సత్తయ్య బయటకు వెళ్లారు. రోడ్డు దాటుతుండగా, ఇంతలో హైదరాబాద్ ​నుంచి కల్వకుర్తి వైపునకు అతివేగంగా దూసుకొస్తున్న కారు(టీఎస్​08 యూబీ9525) వారిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ సుమారు పది మీటర్ల ఎత్తున గాల్లోకి ఎగిరిపడ్డారు. ఇది గమనించి కారును ఆపేందుకు వెళ్లిన రామచంద్రయ్య అనే వ్యక్తిని డ్రైవర్​ ఢీకొట్టి అత్యంత చాకచక్యంతో కారును ఆపినట్టే ఆపి తిరిగి తిప్పుకొని పరారయ్యాడు. సినిమాను తలపించేలా రెప్పపాటులో జరిగిన ఈ ఘటనను చూసి స్థానికులంతా హతాశులయ్యారు.

గాయపడిన వారిని తీసుకెళ్తున్న పోలీసులు

కారు విడిచి డ్రైవర్ పరారీ
పోలీసులు, స్థానికులు వెంబడించడంతో డ్రైవర్​ తప్పించుకుని కొట్ర గేట్ ​నుంచి ఊరులోకి కారును మలిపాడు. గ్రామనడిబొడ్డున మరో ఇద్దరిని ఢీకొట్టే సమయంలో గ్రామస్తులు తప్పించుకున్నారు. కారును రెట్టించిన స్పీడ్​తో వెళ్తుండగా కొట్ర గ్రామస్తులు బిత్తరపోయారు. చివరికి కారును బుడ్డొనిపల్లికి తీసుకెళ్లి అక్కడే వ్యవసాయ పొలాల్లో చెట్లమాటున వదిలివెళ్లి పరారయ్యాడు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్లు స్థానికులు, గ్రామస్తులు చెబుతున్నారు. కారును వదిలేసి అందులో ఉన్నవారు కూడా కాలినడకన జారుకున్నారు. కాగా, గాయపడిన వారికి చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగా, వెంకటేశ్​ మార్గమధ్యంలోనే చనిపోయాడు. సత్తయ్య, రామచంద్రయ్య చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. సంఘటన స్థలాన్ని వెల్దండ సీఐ రామకృష్ణ, ఎస్సై నర్సింహులు పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలను ఆరాతీశారు. బుడ్డొనిపల్లి వద్ద విడిచివెళ్లిన కారును పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారుడ్రైవర్ పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గాయపడిన వారిని చికిత్సకు తీసుకెళ్తున్న పోలీసులు