- జూబ్లీహిల్స్‌లోని ఇంటివద్ద ఉద్రిక్తత
- ఉదయం నుంచే మోహరించిన పోలీసులు
- ఎర్రవెల్లి వెళ్లేందుకు ప్రయత్నించగా అదుపులోకి
- జగిత్యాలలో జీవన్ రెడ్డి, శ్రీధర్‌బాబు కూడా అరెస్ట్
సామాజికసారథి, హైదరాబాద్: తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రవెల్లికి వెళ్లకుండా జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటివద్దకు ఉదయం నుంచే పోలీసులు చేరుకుని నిర్బంధించారు. దీంతో కాంగ్రెస్కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. సోమవారం ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కార్యక్రమానికి అనుమతి లేదని రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు జగిత్యాలలో గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగల్లాగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. రైతులను వద్దని చెప్పి 150ఎకరాల్లో సీఎం కేసీఆర్ వరిని ఎలా సాగుచేస్తున్నారని ప్రశ్నించారు. సీఎంకు ఒక నీతి.. రైతులకో నీతా అని జీవన్ రెడ్డి నిలదీశారు. మరో ఎమ్మెల్యే శ్రీధర్ బాబును సైతం పోలీసులు అడ్డుకున్నారు.
సీఎం కేసీఆర్ధర్నా చేసేవారా?
టీఆర్‌ఎస్ ప్రభుత్వం భావప్రకటన స్వేచ్ఛను హరించడం అప్రజాస్వామికమని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లుభట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ప్రజావ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేయకుండా అడ్డుకోవడం, పోలీసులతో నిర్బంధం ప్రయోగించడం దుర్మార్గమన్నారు. సీఎం దత్తత గ్రామం ఎర్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే రచ్చబండ కార్యక్రమానికి వెళ్లకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబుతో పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులతో గృహనిర్బంధం చేయించిన తీరును తీవ్రంగా ఖండించారు. పోలీసులు హౌస్ అరెస్ట్‌చేస్తే వరి ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసేవారా? అని ప్రశ్నించారు. ధర్నాల విషయంలో టీఆర్‌ఎస్ పార్టీకి ఒక న్యాయం? ప్రతిపక్షాలకు మరో న్యాయమా? ప్రజాస్వామ్య పాలనలో ఇదేం పద్ధతి అని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజావ్యతిరేక విధానాలపై ధర్నాలు చేస్తే పోలీసుల చేత అరెస్ట్చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. దేశంలో ఇప్పటివరకు రైతులు వరి వేయొద్దని ఏ రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదన్నారు. అన్నదాతలు అధైర్యపడొద్దని.. ధాన్యం కొనుగోలు చేయకుంటే బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలపై కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తుందని సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.
తెలంగాణలో పోలీస్ రాజ్యం
రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుందా.. లేదంటే ప్రజాస్వామ్యం నడుస్తోందా? అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి ప్రశ్నించారు. ఎర్రవల్లి గ్రామంలో రైతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించవద్దా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడి అని చెప్పలేదని మల్లు రవి పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్‌లను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
రచ్చబండ కార్యక్రమానికి వెళ్లే కాంగ్రెస్ నేతల అరెస్ట్ పై మాజీ ఎంపీ వి.హనుమంతరావు మండిపడ్డారు. సోమవారం బాగ్ అంబర్ పేటలోని ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వానికి భయపడి రాష్ట్రంలో బీజేపీకి ఓ న్యాయం.. కాంగ్రెస్ కు మరో న్యాయం జరుగుతుందని ఆరోపించారు. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు ఏకమై తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అంతమొందించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.