Breaking News

ప్రధాని మోడీ పర్యటన రికార్డులను భద్రపర్చండి

ప్రధాని మోడీ పర్యటన రికార్డులను భద్రపర్చండి
  • రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తును 10వరకు నిలిపివేయాలి
  • పంజాబ్‌ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం పంజాబ్‌ పర్యటనకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రతపర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయన పర్యటనలో భద్రతా లోపాలపై వస్తున్న ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించిన అన్ని వివరాలతో కూడిన రికార్డులను సురక్షితంగా భద్రపరచవలసిన జవాబుదారీతనం, బాధ్యతలను హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు అప్పగించింది. రిజిస్ట్రార్‌ జనరల్‌కు అవసరమైన సహకారాన్ని పంజాబ్‌ పోలీసులు, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్‌పీజీ), ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీలు అందించాలని సూచించింది. రిజిస్ట్రార్‌ జనరల్‌తో సమన్వయం కోసం చండీగఢ్‌ డీజీపీ, జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ అధికారి ఒకరు నోడల్‌ ఆఫీసర్లుగా పనిచేయాలని సూచించింది. ఈ సంఘటనపై దర్యాప్తు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన కమిటీలు తమ కార్యకలాపాలను జనవరి 10వ తేదీ  వరకు నిలిపివేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది.