- ఐకేపీలో ఇప్పటికీ పేరుకుపోయిన ధాన్యం నిల్వలు
- మద్దతు ధర కోసం పడిగాపులు
- నిండా ముంచుతున్న మిల్లర్లు
సామాజిక సారథి, హాలియా: ఈ ఖరీఫ్ సీజన్ కర్షకులకు కష్టాలనే మిగిల్చింది. వానకాలం పంటలు చేతికి వచ్చిన దగ్గరనుంచి రైతులు ఆ పంటను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. గతనెల నవంబర్ నుంచి వరికోతలు ప్రారంభించిన రైతులకు అడుగడుగునా అకాల వర్షాలు పలకరిస్తూ రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సాగర్ ఆయకట్టులో వరికోతలు ముమ్మరంగా సాగుతున్న సమయంలో వర్షాలు కురిసి రైతులకు తీరని నష్టాన్ని మిగిలిస్తున్నాయి. వానకాలం సీజన్ రైతులు బీపీటీ వరి ధాన్యాన్ని సాగు చేయడం సహజం. కాగా, పంట చేతికొచ్చాక ధాన్యానికి మద్దతు ధర లేక సరైన సమయంలో ఐకేపీ సెంటర్లు ప్రారంభించక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వరి కోతలతో పాటు వర్షాలు కూడా కురుస్తుండడం రైతులకు ఇబ్బంది కలిగించాయి. ఐకేపీ కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయకపోవడంతో రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాకుండానే నష్టాలకు అమ్ముకున్నారు. బీపీటీ క్వింటాలు ధాన్యం రూ.1960 ఉండగా వ్యాపారులు ధాన్యం తడిసిందనే సాకు చూపి రూ.1500 నుంచి రూ.1600 వరకే కొనుగోలు చేయడంతో పాటు ఖర్చుల అదనమని రైతుల వద్ద వసూలు చేస్తున్నారు. అనుముల మండలంలోని కొత్తపల్లి సొసైటీ పరిధిలో ఇబ్రహీంపేట వద్ద దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత రైతులు జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నా ఇప్పటివరకూ స్పందించలేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్లయితే సుమారు 10 గ్రామాల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని రైతులు మొరపెట్టుకుంటున్నారు.
ధాన్యం కొనుగోలు కాక ఐకేపీ సెంటర్లలో పేరుకుపోయిన ధాన్యం