Breaking News

నాగర్​కర్నూల్​ జిల్లాలో పొలిటికల్​ సైలెన్స్​

నాగర్​కర్నూల్​జిల్లాలో పొలిటికల్​సైలెన్స్

  • ప్రభావం చూపలేకపోతున్న ప్రతిపక్ష పార్టీలు
  • అంతా అధికారపార్టీదే హవా
  • సొంత ఎజెండాలతో ముందుకు వెళ్లలేని నాయకులు

సామాజికసారథి, నాగర్​కర్నూల్ ప్రతినిధి: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ పొలిటికల్​హీట్​రాజుకుంటోంది. ఏ జిల్లాలో చూసినా రాజకీయ చర్చలు జోరందుకున్నాయి. ఫలానా పార్టీ నుంచి ఫలానా నాయకుడు పోటీచేస్తున్నాడనే వార్తలు గుప్పుమంటున్నాయి. చిన్నాచితక లీడర్లు సైతం అధికారంలోకి వచ్చే పార్టీ వైపు వెళ్లాలని తమ అంచనాల్లో ఉన్నారు. కానీ నాగర్ కర్నూల్ జిల్లా రాజకీయాలు మాత్రం కాస్తా స్తబ్దంగానే ఉన్నాయని చెప్పవచ్చు. ప్రతిపక్షపార్టీల్లో బలమైన నాయకులు లేకపోవడం, కేడర్​ను నడిపించేవారు కనిపించకపోవడంతో అధికారపార్టీ నేతల హవా కొనసాగుతోంది. బడా నేతలంతా ఒకే పార్టీలో ఉంటూ వారిలో వారే పెనుగులాడుతూ ఉన్నారే తప్ప అధికారపార్టీని ఇరుకున పెట్టే వ్యూహం రచించకపోవడంతో జిల్లాలో అధికారపార్టీ నాయకులు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది.
– ప్రతిపక్షపార్టీల విషయానికొస్తే అధికారపార్టీతో పోటీకి నిలిచేపార్టీ కాంగ్రెస్ మాత్రమే ప్రజలు తెగేసి చెబుతున్నారు. కాంగ్రెస్ లో గతంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన నాయకులు ఉన్నారు. కానీ వారు నియోజకవర్గాల్లో పట్టు సాధించలేక గ్రామస్థాయి లీడర్లతో మమేకం కాలేకపోవడం గతంలో వారి వెనక ఉన్న కేడర్ అంతా ప్రస్తుతం అధికారపార్టీ చుట్టూ చేరడంతో వారికి ప్రజల్లో పలుకుబడి ఉన్న గ్రామస్థాయిలో భారీ జెండాలు మోసే లీడర్లు లేకపోవడం పెద్దమైనస్ గా మారింది. అచ్చంపేట నియోజకవర్గంలో మాజీఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ బలమైన నేతగా ఉన్నారు. గత రెండు పర్యాయాలు అధికార పార్టీ నాయకుడు గువ్వల బాలరాజు చేతిలో పరాజయంపాలవడంతో ఈసారైనా మళ్లీ విజయాన్ని అందుకోవాలని సంకల్పిస్తున్నారు. కానీ పూర్తిస్థాయి సమయాన్ని నియోజకవర్గానికి కేటాయించకపోవడం క్యాడర్​లో కొద్దిపాటి నిరుత్సాహం కనిపిస్తుంది.
– కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా మోసే నాయకుడు కరువయ్యారు. గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరడం మళ్లీ నియోజకవర్గ స్థాయిలో నేత లేకపోవడం ప్రస్తుతం ఇద్దరు, ముగ్గురు నాయకులు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న అప్పటికీ పార్టీ కార్యక్రమాలు పెద్దఎత్తున చేయలేకపోతున్నారు. జిల్లా కేంద్రమైన నాగర్​కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మాజీమంత్రి సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి ముందుండి నడిపిస్తున్నారు. అయితే ఆయన నియోజకవర్గంలో విస్తృతస్థాయిలో పర్యటించలేకపోతున్నారు. దీంతో గ్రామస్థాయిలో లీడర్లను కలవలేకపోవడం, గతంలో ఆయన వెంట ఉన్న నాయకులంతా ప్రస్తుతం అధికారపార్టీలో ఉండటం నియోజకవర్గంలో ఆయన కేవలం ప్రెస్ మీట్ లకు మాత్రమే పరిమితం కావడం కేడర్​లో ఆత్మస్థైర్యాన్ని నింపినలేకపోతుంది.
– కల్వకుర్తిలో కాంగ్రెస్ నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి గత ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఎలక్షన్ సీజన్ ముంచుకొస్తుండటంతో గ్రామగ్రామాన పర్యటిస్తూ కార్యకర్తలను ఇతర పార్టీల నాయకులను ఆకర్షించే పనిలో ఉన్నారు. అయితే ఇక్కడ త్రిముఖపోరు ఉండటంతో హస్తానికి ఆశించిన ఫలితాలు రావడం లేదు. దీంతో జిల్లాలో నాయకులు గ్రామీణస్థాయిలో పర్యటిస్తే తప్ప అధికారంలోకి వచ్చే దాఖలాలు లేవని కార్యకర్తలు చెబుతున్నారు.
నానాటికి తీసికట్టుగా బీజేపీ
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ తమదేనని చెబుతున్నా బీజేపీ నాయకులు జిల్లాలో పార్టీని పటిష్టం చేసేందుకు మాత్రం కృషిచేయడం లేదు. నాగర్ కర్నూల్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కొంతం గొప్పో కల్వకుర్తి నియోజకవర్గంలోని పార్టీ పటిష్టంగా ఉందని నాయకులు చెబుతున్నారు. అది కూడా బీజేపీ నుంచి తల్లోజు ఆచారి పోటీచేస్తే మాత్రమే పార్టీకి ఓట్లు గణనీయంగా పడే అవకాశం ఉంది. ఇతరులకు ఎవరికీ అవకాశమిస్తే ఇది పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. ఇక్కడ బీజేపీ ఇతర పార్టీల నుంచి వచ్చే బలమైన నాయకులకు టికెట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ ఇప్పట్లో బీజేపీలోకి జిల్లాలో వచ్చే బలమైన నాయకులు మాత్రం కనిపించడం లేదు. జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు ఇన్​చార్జ్​గా ఉన్న కొల్లాపూర్ లో పార్టీకి కొద్దిపాటి ఓట్లు పడొచ్చు కానీ అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జూపల్లి, బీరం హర్షవర్ధన్ రెడ్డి మధ్య ప్రధానపోరు కనిపిస్తోందని సర్వేలు చెబుతున్నాయి. జూపల్లి కృష్ణారావు బీజేపీ నుంచి పోటీచేస్తే అవకాశాలు మెరుగుపడతాయని అక్కడి నాయకులు అంచనా వేస్తున్నారు. నాగర్​కర్నూల్ నియోజకవర్గంలో మాత్రం బీజేపీ కనీసం పోటీఇచ్చే స్థాయిలో కూడా లేదని నియోజకవర్గ ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఉన్న బలమైన నాయకత్వం లేకపోవడం ఇక్కడ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
– అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిన సతీష్ మాదిగ పార్టీలోకి వచ్చినా తర్వాత నియోజకవర్గంలో పార్టీని పటిష్టపరిచేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదు. ఆయన ఆరోగ్య కారణాల రీత్యా పార్టీకి దూరంగా ఉండటం జిల్లాలో బీజేపీలో కొనసాగుతున్న ఆధిపత్యధోరణి వల్ల ఇటీవల పార్టీలో 20ఏళ్లుగా పనిచేస్తున్న కొంతమంది నాయకులు పార్టీకి దూరమయ్యారు. దీంతో నియోజకవర్గంలో అది కొంత మైనస్ గా మారిందని చెబుతున్నారు. మొత్తంగా నాగర్ కర్నూల్ జిల్లాలో రాజకీయాలు స్తబ్దతగా మారడంతో అధికారపార్టీ నాయకులు తమదే హవాగా చెప్పుకునే తిరుగుతున్నారు.