- యూకే టు హైదరాబాద్
- ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా గుర్తింపు
- గచ్చిబౌలి టిమ్స్‌లో వైద్యపరీక్షలు
- కరోనా ఇంకా కనుమరుగు కాలే..
- మాస్క్ లేకుంటే రూ.వెయ్యి జరిమానా
- వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటేనే బెటర్
- రెండు, మూడు నెలలు జాగ్రత్తగా ఉండాల్సిందే
- పబ్లిక్హెల్త్డైరెక్టర్శ్రీనివాస్ రావు వెల్లడి
సామాజిక సారథి, హైదరాబాద్: దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 24 దేశాలకు విస్తరించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒమిక్రాన్దేశానికి రావొచ్చని, యూకే నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ 35 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని స్టేట్పబ్లిక్హెల్త్డైరెక్టర్శ్రీనివాస్ రావు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆయన సూచించారు. మాస్కు ధరించకపోతే పోలీసులు రూ.వెయ్యి జరిమానా విధిస్తారని తేల్చిచెప్పారు. మాస్కు ధరించడంతో పాటు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన కోరారు. ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ కట్టడిపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి. తప్పనిసరిగా అందరూ కొవిడ్ టీకా రెండు డోసుల తీసుకోవాలి. ఒమిక్రాన్ నివారణకు మన వంతు ప్రయత్నం చేయాలి. జాగ్రత్తలు పాటించకపోతే ఇప్పుడు జరుగుతున్న అసత్య ప్రచారాలే వాస్తవాలవుతాయని ఆయన హెచ్చరించారు. ముప్పు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని శ్రీనివాస్ రావు హెచ్చరించారు.
కరోనా పూర్తిగా కనుమరుగు కాలే..
‘‘కరోనా వైరస్ పూర్తిగా కనుమరుగు కాలేదు. వృద్ధులు, ఇతర రోగాలు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో సుమారు 25 లక్షల మందికి పైగా సెకండ్ డోసు తీసుకోనివారు ఉన్నారు. 15 లక్షల మందికి పైగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నారు. 80 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి. రెండు డోసులు తీసుకోవడం ద్వారానే పూర్తి రక్షణ లభించే అవకాశం ఉంది. మాస్కులే వ్యాక్సిన్‌లా పనిచేస్తాయి. సామాజిక బాధ్యతగా వచ్చే రెండు, మూడు నెలలు మాస్క్ధరిస్తే థర్డ్ వేవ్‌ను అరికట్టే అవకాశం ఉంది. అన్నిరకాల పనిప్రదేశాల్లో ప్రయాణికులు కూడా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉంచుకోవాలి’’ అని శ్రీనివాస్ రావు సూచించారు. గతంలో తీసుకున్న కరోనా జాగ్రత్తలే మళ్లీ మళ్లీ తీసుకోవాలని కోరారు.
24 దేశాలకు ఒమిక్రాన్
యూకే, సింగపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 325మంది ప్రయాణికులు బుధవారం వచ్చారు. రాష్ర్టానికి చెందిన వారు 239 మంది ఉన్నారు. వారందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. ఇందులో యూకే నుంచి ఓ మహిళా ప్రయాణికురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెను తక్షణమే గచ్చిబౌలి టిమ్స్‌కు తరలించి ఐసొలేషన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆమె నుంచి శాంపిళ్లను సేకరించి ఫుల్ జీనోమ్ సీక్వెన్స్‌కు పంపించాం. మూడు, నాలుగు రోజుల్లో ఆ రిపోర్టు వస్తేనే ఆ వైరస్ ఒమిక్రాన్ వేరియంటా? లేక డెల్టా వేరియంటా? అనే విషయం తేలుతుందన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ మూడు రోజుల్లోనే మూడు దేశాల నుంచి 24 దేశాలకు విస్తరించిందని శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలే మనకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.
31లోపు వ్యాక్సినేషన్ పూర్తి
డిసెంబర్ 31వ తేదీలోపు వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకంటున్నామని పబ్లిక్హెల్త్డైరెక్టర్శ్రీనివాస్రావు తెలిపారు. మాస్కు ధరించడం, వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి చేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకోవడంతో వైరస్‌ను అరికట్టవచ్చన్నారు. ఫంక్షన్లు, పండుగ సమయాల్లో జాగ్రత్తలు పాటించాలని కోరారు.