-మినిష్టర్, కలెక్టర్ ఎవ్వరికన్నా చెప్పుకో….
-వనపర్తి డీఈఓ గా నన్ను తీసేసే దమ్ము ఉందా…
-రోజు ఇలాగే సర్కారు కారును వాడుకుంటా…
-నాకు ఎలాంటి అభ్యంతరం లేదని రాసి ఇవ్వాల్సీందే
కారు ఓనర్ ను బెదిరిస్తున్న వనపర్తి డీఈఓ రవీందర్
సోషల్ మీడియాలో స్టూడెంట్ యూనియన్ నేత,
-కారు ఓనర్ కాల్ రికార్డింగ్ హల్ చల్
సామాజిక సారథి, వనపర్తి:
వనపర్తి జిల్లా డీఈఓ రవీందర్ సర్కారు కారును రూల్స్ కు విరుద్దంగా వాడుకుంటూ కారు ఓనర్ ను వేదిస్తున్న విషయంపై శనివారం సామాజిక సారథి పేపర్ లో సొమ్ము సర్కారుది… సోకు డీఈఓ ది పేరిట కథనాన్న ప్రచురించింది.ఈ కథనం వనపర్తి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటు పలువురు స్టూడెంట్ యూనియన్ నాయకులు ఈ పేపర్ క్లిప్పింగ్ ను జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తో పాటు సోషల్ మీడియాలో షేర్ చేసి వనపర్తి డీఈఓ రవీందర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.
కారు ఓనర్ కు బెదిరింపులు…
రూల్స్ కు విరుద్దంగా డీఈఓ ఆఫీస్ కు పెట్టిన అద్దె కారును తన స్వంత గ్రామం మహబూబ్ నగర్ కు తీసుకెళ్తున్న విషయం పత్రికల్లో, సోషల్ మీడియాలో రావడంతో డీఈఓ రవీందర్ ఆగ్రహంతో వూగి పోయారు. కారు ఓనర్ బాలస్వామి ని ప్రత్యేకంగా పిలిపించుకొని బెదిరింపులకు పాల్పడ్డాడు. నా ఫ్యామిలీ మహబూబ్ నగర్ లో ఉంది కాబట్టి నేను ప్రతి రోజు డ్యూటీ అయిపోగానే వనపర్తి నుంచి మహబూబ్ నగర్ కు కారు ను తెచ్చుకుంటానని దీనీకి నీవు ఒప్పుకుంటున్నట్లు కాగితం పై రాసివ్వాలని బెదిరింపులకు దిగాడు. వనపర్తి జిల్లా కలెక్టర్, స్థానిక మంత్రి నిరంజన్ రెడ్డి, ఇంకా పై ఆఫీసర్లకు కంప్లైట్ చేసుకున్నా తన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేరని కారు ఓనర్ తో వాగ్వాదానికి దిగారు. తనను వనపర్తి డీఈఓ గా తొలగించే దమ్ము ఎవ్వరికి లేదని, తనకు స్టేట్ లెవల్ లో పరపతి ఉందని దబాయించాడు. దీంతో డీఈఓ తనను బెదిరించిన విషయాన్ని ఇటీవల డీఈఓ అవీనితి ఆరోపణల పై చర్యలు తీసుకోవాలని వనపర్తి కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన స్టూడెంట్ యూనియన్ లీడర్ తో చెప్పుకున్నాడు. స్టూడెంట్ యూనియన్ లీడర్ కారు ఓనర్ మాట్లాడుకున్న కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం గమనార్హం. ఈ కాల్ రికార్డింగ్ ను సదరు స్టూడెంట్ యూనియన్ లీడర్ వనపర్తి జిల్లా కలెక్టర్ కు, మంత్రి నిరంజన్ రెడ్డికి పంపించి ఇప్పటికైనా యాక్షన్ తీసుకోవాలని కోరినట్లు తెలిసింది.
మొదటి నుంచి అవినీతి, ఆరోపణలే…
వనపర్తి జిల్లా డీఈఓ గా రవీందర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక అవీనితి, అక్రమాలకు పాల్పడుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. జిల్లా అధికారులు ఎలాంటి విచారణ చేపట్టకపోవడం, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నిరంజన్ రెడ్డి సైతం ఇలాంటి అవినీతి అధికారిని పట్టించుకోకపోవడంతో ఈయన మరింత రెచ్చిపోయారు.
• ప్రైవేట్ స్కూళ్ల కు అనుమతులను రెన్యువల్ చేసేందుకు ఆన్ లైన్ రూల్స్ పాటించాల్సి ఉన్నా వాటిని పక్కన పెట్టి ఒక్కో ప్రైవేట్ స్కూల్ నుంచి రూ.30 వేల నుంచి రూ80 వేల వరకు వసూలు చేసి ఆఫ్ లైన్ లో అనుమతులు ఇచ్చారు.
• వనపర్తి జిల్లాలో పదో తరగతి స్టూడెంట్లకు నిర్వహించిన ఆన్సర్ షీట్లు, స్పాట్ వాల్యుయేషన్ పేపర్లు, ఇతర చిత్తు పేపర్లను గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకున్నారు.
• జిల్లాలో టీచర్ల డిప్యూటేషన్ల కోసం రూల్స్ కు విరుద్దంగా లంచాలు ఇచ్చిన వారికి వారు కోరుకున్న స్కూళ్లకు కెటాయించి సొమ్ము చేసుకున్నారు.
• జిల్లాలో కేజీబీవీ స్కూళ్లు, అర్భన్ రెసిడెన్షియల్ స్కూళ్ల ల్లో ప్రతి నెల బోగస్ లెక్కలు రాయించి ఆ బిల్లులను ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా అప్రూవల్ చేస్తూ ప్రతి నెల కమీషన్లు వసూలు చేస్తున్నారు. ఈ అకాడమిక్ ఇయర్ జూన్ నుంచి ఇప్పటి వరకు డీఈఓ ఆఫీస్ వాళ్లు అప్రూవల్ చేసిన బిల్లులను ప్రత్యేక ఆడిటింగ్ టీం ద్వారా విచారణ చేస్తే డీఈఓ అవినీతి వెలుగు చూసే అవకాశం ఉన్నా జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదు.
• వనపర్తి డీఈఓ ఆఫీస్ లో ఏడి(అసిస్టెంట్ డైరెక్టర్), సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, లు ఆఫీస్ రాకున్నా సంతకాలు పెట్టుకోవడం, ఇష్టంవచ్చినట్లు అటెండెన్స్ రిజిష్టర్ లో సీఎల్స్ వేసుకొని పుల్ జీతం తీసుకుంటున్నా డీఈఓ వెనకేసుకు వస్తున్నాడు.
• వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూర్ మండలాల్లో ఎలాంటి అనుమతులు లేకున్నా గురుకుల, నవోదయ, సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్లు నడుస్తున్నా పట్టించుకోకుండా వారి నుంచి కమీషన్లు తీసుకొని కొందరికి స్కూళ్ల పేరిట అనుమతులు ఇస్తూ అవినీతికి పాల్పడుతున్నాడు.
• కేజీబీవీ ల్లో ఎలాంటి నోటిఫికేషన్లు వేయకుండా లంచాలు ఇచ్చిన వారికి నాన్ టీచింగ్ ఉద్యోగాలను అమ్ముకుంటూ ఎవ్వరైనా సమాచారం అడిగితే ఎమ్మెల్యే, మంత్రుల పేర్లు చెప్పి తప్పించుకుంటున్నారు.
• వనపర్తి బాలభవన్ ఎలాంటి రికార్డులు రాయకుండా స్టూడెంట్ల నుంచి రూల్స్ కు విరుద్దంగా ఫీజులు వసూలు చేసినా పట్టించుకోకుండా అవినీతికి పాల్పడుతున్న సూపరింటెండెంట్ ను వెనకేసుకు వస్తు తన కమీషన్ ఇస్తే చాలన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు.
• వనపర్తి జిల్లాలో గవర్నమెంట్ల స్కూళ్ల పర్యవేక్షణ గాలికొదిలేయడంతో క్షేత్రస్థాయిలో ఎంఈఓ లు పట్టించుకోవడం మానేశారు. దీంతో మారుమూల ప్రాంతాలు, గిరిజన తాండాలు, సింగిల్ టీచర్ స్కూళ్లు సారోళ్లు వచ్చినప్పుడే బడి అన్న చందంగా మారాయి.
• టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్ల కోసం రూల్స్ కు విరుద్దంగా పదో తరగతి స్టూడెంట్లకు పాఠాలు చెప్పేవారు లేకుండా జీహెచ్ఎం లు, స్కూల్ అసిస్టెంట్ టీచర్లను డీఈఓ ఆఫీస్ కు పిలిపించుకొని సుమారు 20 రోజుల సమయాన్ని వృథా చేశారు. పరీక్షల సమయంలో సబ్జెక్ట్ టీచర్లు, జీహెచ్ఎం లు లేకపోవడంతో పదో తరగతి స్టూడెంట్లు పూర్తిగా న ష్టపోయారు.
• ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి గవర్నమెంట్ హైస్కూళ్ల ను పర్యవేక్షణ చేయకుండా వదిలేసి మార్చిలో పబ్లిక్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్న సమయంలో మొక్కుబడిగా స్కూళ్లకు వెళ్లి ఫోటోలకు ఫోజులు ఇచ్చి రావడం చేస్తున్నారు.
• జిల్లాలోని అనేక ప్రభుత్వ స్కూళ్లల్లో స్టూడెంట్లకు కనీస అభ్యసన సామర్ధ్యాలు రాయడం, చదవడం కూడా రాకపోయినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.ఇలా వనపర్తి జిల్లాలో విద్యావ్యవస్థ పూర్తిగా దెబ్బతిని అధ్వాన్నంగా మారినా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో డీఈఓ రవీందర్ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.
ఫోటోరైటప్: 04 01: వనపర్తి జిల్లా డీఈఓ ఆఫీస్