- బీజేపీ మేం పోటీపడలేమన్న అఖిలేష్
లక్నో: రాజకీయ పార్టీలకు వర్చువల్ ప్రచారానికి అనుతినిచ్చినట్లయితే.. అన్ని రాజకీయ పార్టీల పట్ల ఈసీ ఒకేలా అవకాశాలు కల్పించాలని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ఒక వేళ డిజిటల్ ప్రచారానికి అవకాశం కల్పిస్తే బీజేపీ వద్ద ఉన్న మౌలిక సదుపాయాలు ఇతర పార్టీల వద్ద లేవన్నారు. రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌కు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఓ విజ్ఞప్తి చేశారు. ‘రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ కొంత నిధులను అందించాలని, తద్వారా అవి ఒక మెట్టు ఎదిగి.. మౌలిక సదుపాయాలను సమకూర్చుకుంటాయన్నారు. ఎందుకంటే… బీజేపీకి ఉన్న మౌలిక సదుపాయాలతో పోటీపడలేం. ఆ నిధులందిస్తే.. తద్వారా బిజెపికి ధీటుగా అన్ని పార్టీలు బలమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుని, పోటీకి దిగుతాయి’ అని వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు వర్చువల్ ప్రచారాన్ని నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే ఎస్పీ సన్నద్ధంగా ఉందా? అన్న ప్రశ్నకు పై విధంగా స్పందించారు. 2022లో తాము అధికారం చేపడితే ఉన్నతవిద్యను అభ్యసించేందుకు విద్యార్థులు, యువతకు ఉచితంగా ల్యాప్ ట్యాప్‌లను అందిస్తామని ప్రకటించారు. కాగా, ఇది ఆయన రెండో హామీ కాగా, తొలి తాయిలంగా.. వినియోగదారులకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రైతులకు ఉచిత విద్యుత్ ప్రకటించారు. కుల ఆధారిత గణన చేపడతామని, ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అన్నదాతల కుటుంబాలకు రూ.25 లక్షలు అందిస్తామని ప్రకటించారు.