- నాటి విధ్వంసం నుంచి ఆలయానికి ముక్తి
- ఆలయ పునర్నిర్మాణంతో కొత్త అందాలు
- రూ.399 కోట్లతో కారిడార్ పనులు
- ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోడీ
- గంగానదిలో పుణ్యస్నానం.. ప్రత్యేక జలంతో అభిషేకం
వారణాసి: ప్రతిష్టాత్మక ‘కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు’తో నవచరిత్ర సృష్టించామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కాశీ విశ్వనాథ్ ప్రాజెక్టు కారిడార్ నిర్మాణంతో వృద్ధులు, దివ్యాంగులు సైతం జెట్టీలు, ఎస్కలేటర్లలో ప్రయాణించి ఆలయ దర్శనం చేసుకోవడానికి మార్గం సుగమమైందని పేర్కొన్నారు. కొవిడ్ మహ్మరి వెంటాడినా నిర్దేశిత సమయంలో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు శ్రమించిన వర్కర్లు, కారిడార్ కలను సాకారం చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ సర్కార్‌కు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కారిడార్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కాశీ విశ్వనాథుడి ఆశీస్సులు అందరిపై ఉండాలన్నారు. పవిత్రకాశీ విశ్వనాథుడి ఆలయ సుందరీకరణ పనులు, గంగానదిని కలుపుతూ నిర్మించిన కారిడార్‌ను ప్రధాని మోడీ సోమవారం దేశప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శివుడి ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదని, ఈ కారిడార్ కూడా అలాగే జరిగిందన్నారు. కాశీలో అడుగుపెట్టగానే ప్రత్యేక అనుభూతి కలుగుతుందన్నారు. ఎన్ని తరాలైనా కాశీ అందరిలో స్ఫూర్తి నింపుతుందన్నారు. మందిర పునర్నిర్మాణం చేసిన అహల్యాబాయిని అభినందించారు. ఔరంగజేబు దాడితో ధ్వసమైన ఆలయాన్ని పునర్మించిన ఘటనలు ప్రధాని మోడీ గుర్తుచేశారు. విశ్వనాథుడి ప్రియదినం సోమవారం అని.. దశమి తిథి..ఇక్కడ కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందన్నారు. విశ్వనాథ ధామం అకల్పనీయ రీతిలో వెలిగిపోతోందన్నారు. ఇక్కడ జరిగిందంతా కూడా ఆ మహాదేవుడే చేశారన్నారు. ఆకతాయిలు ఈ నగరంపై ఆక్రమణ చేశారని, ధ్వంసం చేయాలని చూశారన్నారు. ఔరంగజేబు అత్యాచారాలు, అతని ఆకృత్యాలకు సాక్ష్యాలన్నారు.
రూ.339కోట్లతో ప్రాజెక్టు పనులు
రూ.339 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. కాశీ విశ్వనాథ్ కారిడార్‌కు ప్రధాని నరేంద్రమోడీ మార్చి 8, 2019న శంకుస్థాపన చేశారు. భక్తులకు వివిధ సౌకర్యాలు కల్పించేందుకు 23 కొత్త భవనాలను నిర్మించారు. ఇది వారణాసిలో పర్యాటక రంగానికి పెద్దపీట వేయాలని భావిస్తున్న ఒక మెగా ప్రాజెక్టుగా రూపొందించారు. కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ తొలుత ‘హర్ హర్ మహదేవ్’ నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పెద్దఎత్తున సాధులు, సంతులు ఈ కార్యక్రమంలో పాల్గొని ‘జై శ్రీరామ్’ నినాదాలతో హోరెత్తించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనంది బెన్ పటేల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, జాతిపిత మహాత్మాగాంధీ వందేళ్ల క్రితం వారణాసి వచ్చారని, అక్కడ ఇరుకు వీధులు, రోడ్లు, అపరిశుభ్ర వాతావరణం చూసి ఎంతో ఆవేదన చెందారని గుర్తుచేశారు. గాంధీజీ పేరుతో చాలా మంది అధికారంలోకి వచ్చారని, అయితే భవ్యకాశీ నిర్మాణంతో తొలిసారిగా ఆయన కల సాకారమైందని చెప్పారు.
ప్రధాని మోడీపై పూలవర్షం
ప్రధాని నరేంద్రమోడీ సోమవారం వారణాసికి ఉదయం 10.45 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి కారులో బయలుదేరిన మోడీపై వారణాసి ప్రజలు గులాబీ పూలవర్షం కురింపించారు. ఓ వ్యక్తి ఆయనకు బహుమతి ఇచ్చేందుకు కాషాయి వస్త్రాల్లో రావడంతో కానుకను మోడీ కారు డోర్ ఓపెన్ చేసి స్వీకరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 40 పురాతన ఆలయాలను పునరుద్ధరించి సుందరీకరించారు. ఈ ప్రాజెక్టు కోసం ఆలయం చుట్టూ సుమారు 300 ప్రాపర్టీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1400 మంది షాపులను, కిరాయిదారులను, ఇంటి యజమానులకు మరోచోట స్థానం కల్పించారు.
కాశీ ఆలయంలో విశేషపూజలు
కాశీ విశ్వనాథుడికి ప్రధాని మోదీ గంగా జలాభిషేకం చేసి భక్తిశ్రద్ధలతో ప్రత్యేకపూజలు నిర్వహించారు. గంగానదిలో పుణ్య స్నానం చేసి.. తన మెడలో ఉన్న జపమాలను తీసి మంత్రాలు చదువుతూ పూజలు చేశారు. నదిలో మునకలు వేశారు. ఆ నదీ జలంతో విశ్వనాథుడి వద్దకు వెళ్లి అభిషేకం చేశారు. ఈ సందర్భంలో ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా రుద్రాభిషేకం జరిపించారు. గంగానది నుంచి నీటితో ఆలయానికి వెళ్తున్న సమయంలో ప్రధాని మోడీకి ఘనస్వాగతం పలికారు. నది నుంచి కొంత దూరం వరకు కారులో వెళ్లి ఆ తర్వాత ఆయన నడుచుకుంటూ స్వామివారి సన్నిధికి వెళ్లారు. ఇక ఆలయ పరిసరాల్లో ఢమరుక స్వాగతం ఆకట్టుకుంది.ఈ సందర్భంగా కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గర్భగుడిలో నరేంద్రమోడీ చేత వేదపండితులు అభిషేకం చేయించారు. తొలుత వారు సంకల్పం చదివారు. విఘ్నేశ్వర పూజ.. బిల్వపత్రం సమర్పణ.. పంచామృత పూజ.. వస్త్రం, యజ్ఞోపవీతం సమర్పణ.. నమక.. చమకాలతో విశ్వనాథుడి ఆలయం మంత్రోచ్ఛరణతో ప్రజ్వరిల్లింది. కర్పూర హారం.. కరుణావతారం అంటూ గర్భగుడిలో విశ్వనాథుడిని కీర్తించారు. పూజారులు ప్రధాని మోడీకి ఆశీర్వాదాలు అందించారు.