- 361 మంది .. 576 నామినేషన్లు
- చివరి రోజున 407 నామినేషన్లు దాఖలు
- పలు వార్డుల్లో ఖరారు కానీ పార్టీ అభ్యర్థులు
- నేడు నామినేషన్ల పరిశీలన
సారథి ప్రతినిధి, సిద్దిపేట: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం ముగిసింది. మూడు రోజుల పాటు మున్సిపల్ ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరించారు. తొలి రెండు రోజులు తక్కువగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా చివరి రోజు పెద్దసంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా అధికార పార్టీతో సహా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పలు వార్డుల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో పార్టీ టికెట్ ఆశించిన నాయకులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో అన్ని పార్టీలకు రెబల్స్ బెడద తప్పేలా కన్పించడం లేదు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో నేడు నామినేషన్ల పరిశీలన ఉంటుందని ఎన్నికల అధికారి తెలిపారు.
ముగిసిన నామినేషన్లు
సిద్దిపేట మున్సిపాలిటీలో 43 వార్డులకు సంబంధించి మూడు రోజుల పాటు నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియ కోవిడ్ నేపథ్యంలో సాదాసీదాగా కొనసాగింది. మూడు రోజుల్లో 43 వార్డులకు 361 మంది అభ్యర్థులు 576 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో అధికార పార్టీయైనా టీఆర్ఎస్ నుంచి 208, బీజేపీ నుంచి 118, కాంగ్రెస్ 58, ఎంఐఎం 10, సీపీఐ 1, సీపీఎం 1, స్వతంత్రులు 171, ఇతరులు 1 చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల చివరి రోజు అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. ఆదివారం ఒక్క రోజే 407 నామినేషన్లు దాఖలు చేసినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.
ఖరారు కాని పార్టీ అభ్యర్థులు
సిద్దిపేట మున్సిపాలిటీకి సంబంధించి అధికార టీఆర్ఎస్ తో సహా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల పేర్లు పూర్తిస్థాయిలో ఏ పార్టీ ప్రకటించలేదు. అధికార టీఆర్ఎస్ 43 వార్డులకు గాను కేవలం 18 మందిని ప్రకటించింది. ఇంకా 25 మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా బీజేపీ తొలి జాబితాగా కేవలం 12 మందిని మాత్రమే ప్రకటించింది. కాంగ్రెస్ మాత్రం అధికారికంగా ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ కంటే స్వతంత్రంగా పోటీ చేయడానికే చాలా మంది అభ్యర్థులు మొగ్గు చూపుతున్నారు. రేపటిలోగా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
నేడు నామినేషన్ల పరిశీలన
సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని 43 వార్డులకు అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ఆదివారంతో ముగియగా.. సోమవారం అభ్యర్థుల నామినేషన్లు పరిశీలించి పూర్తి వివరాలు లేని, అప్లికేషన్ ఫారం సరిగా నింపని దరఖాస్తులను తొలగిస్తామని చెప్పారు. తొలగించిన నామినేషన్లను తిరిగి అప్పీలు చేసుకోవడానికి మంగళవారం సాయంత్రం వరకు అవకాశం కల్పిస్తున్నామని, మంగళవారం రోజున నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం కల్పిస్తామని మున్సిపల్ ఎన్నికల అధికారి తెలిపారు. మొత్తానికి ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఎవరూ ఏ పార్టీ తరఫున బరిలో నిల్చుంటారనేది బుధవారంతో తేలనుంది.