- నిన్న నామినేషన్.. నేడు ఎన్నిక
- రెండవసారి మండలిలోకి ప్రవేశం
- అభినందించిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు
సామాజిక సారథి, నిజామాబాద్: సీఎం కేసీఆర్ కూతురు, సిట్టింగ్ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థిగా మళ్లీ పోటీచేసిన ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో ఆమెకు లైన్ క్లియర్ అయింది. మంగళవారం ఆమె నామినేషన్ దాఖలు చేయగా.. ఒక్కరోజు గ్యాప్‌లోనే బుధవారం ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. కవిత ప్రస్తుత మండలి సభ్యత్వం త్వరలో ముగియనుండగా.. మళ్లీ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఆమె ఆసక్తి చూపడం లేదనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్‌ను ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఖరారు చేయడంతో ఆయన స్థానంలో కవితను ఢిల్లీకి పంపిస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. అందుకు తగినట్లుగానే నిజామాబాద్ స్థానానికి సిట్టింగ్ఎమ్మెల్సీ ఆకుల లలిత పేరు వినిపించింది. కానీ, టీఆర్ఎస్ అధిష్ఠానం ఊహాగానాలకు తెరదించుతూ.. నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మళ్లీ కవిత పేరునే ఖరారు చేసింది. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా నివాసంలో సంబురాలు మిన్నంటాయి. ఎమ్మెల్యే మంత్రి ప్రశాంత్ రెడ్డికి మిఠాయిలు తినిపించి, పటాకులు పేల్చి విజయోత్సవం జరుపుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ విఠల్ రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాంకిషన్ రావు, తదితరులు పాల్గొన్నారు.