సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పేరుతో టీఆర్ఎస్ నాయకులు కొనసాగిస్తున్న నల్లమట్టి వ్యాపారంపై ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని బహుజన సమాజన్పార్టీ(బీఎస్పీ) నాయకులు డిమాండ్ చేశారు. దళితుల, చెరువు శిఖం భూముల్లో నల్లమట్టి తీయడానికి అనుమతులు ఎవరిచ్చారో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ప్రజల్లో నిజాయితీని నిరూపించుకోవాలని టీఆర్ఎస్ నాయకులకు సూచించారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలోని అంబేద్కర్‌చౌరస్తాలో నిరసన తెలిపారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ.. 2014లో మర్రి జనార్దన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నియోజకవర్గంలోని నందివడ్డెమన్, మంగనూర్, పాపగల్, నేరెళ్లపల్లి, బావాజీపల్లి, ఆవంచ, పోతిరెడ్డిపల్లి, నల్లవెల్లి, నాగర్ కర్నూల్, నాగనూల్ ఇంకా అనేక గ్రామాల్లోని చెరువుల్లో నల్లమట్టిని తీస్తూ వ్యాపారం చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. వట్టెం వెంకటేశ్వర్ల స్వామి ముందున్న వట్టెంగుట్ట, తిమ్మాజీపేట మండలం అల్లంపల్లి శివారులోని గుట్టను తవ్వడం తవ్వడం లేదా? అని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే తన అధికారాన్ని బూచీగా చూపి గ్రామపంచాయతీలకు పైసా ఇవ్వకుండా ఆదాయానికి గండికొడుతున్నారని మండిపడ్డారు. కంపెనీలు ఇష్టారీతిలో నల్లమట్టి కొట్టుకోవడానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏమైనా టెండర్లు పిలిచారా? ప్రభుత్వం ఏమైనా జీవో ఇచ్చిందా? ప్రజలకు చెప్పాలని డిమాండ్‌చేశారు. మీ స్వగ్రామం నేరెళ్లపల్లి చెరువులో నల్లమట్టి తీసినప్పుడు ప్రతి ఓటరుకు డబ్బులు ఇచ్చారు కదా, మరి ఇతర గ్రామాల్లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులు, కేసులు, టీఆర్ఎస్బెదిరింపులకు బీఎస్పీ కార్యకర్తలు భయపడబోరని హెచ్చరించారు. ఇలాంటి చిల్లర పనులను మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా కార్యదర్శి బోనాసి రాంచందర్ అడ్వకేట్, తాలూకా అధ్యక్షుడు బండి పృథ్వీరాజ్, ప్రధాన కార్యదర్శి కొట్ర బాలు, ఉపాధ్యక్షుడు పరుశరామ్, రాంచందర్, శ్రీను, నగేష్, చెన్నయ్య, సురేందర్, శివ, శ్రీకాంత్, అయోధ్య, బాలనాగులు, రాజ్, వీరస్వామి, శివకృష్ణ, నిరంజన్,భాస్కర్, రామ్, మహేష్, శంకర్, రాముడు తదితరులు పాల్గొన్నారు.