- బీఎస్పీ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా మాజీఎంపీ జగన్నాథం?
- 18న పార్టీలో చేరిక.. టికెట్ ఖరారు చేయనున్న అధిష్టానం
సామాజికసారథి, నాగర్‌కర్నూల్ బ్యూరో: బీఎస్పీ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా మాజీఎంపీ మందా జగన్నాథంకు దాదాపు టికెట్ ఖరారైంది. ఈనెల 18న ఆయన బీఎస్పీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. మందా జగన్నాథం మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత. అలంపూర్ కు చెందిన ఆయన స్వయానా డాక్టర్. ఆయన టీడీపీ నుంచి రాజకీయ అరగేట్రం చేశారు. 1999-2008(టీడీపీ), 2008-2013 (కాంగ్రెస్), 2013- 2014(టీఆర్ఎస్)లో ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ ఎంపీగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. అనంతరం 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు. మందా జగన్నాథం స్థానంలో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి బీఆర్ఎస్ అధిష్టానం పోతుగంటి రాములును బరిలోకి దించింది. అప్పటినుంచి మందా జగన్నాథం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ పరంపరలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మందా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. అయితే నాగర్‌కర్నూల్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించగా, అధిష్టానం సీనియర్ నేత, మాజీఎంపీ మల్లు రవికి కేటాయించింది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ పరంపలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరి నాగర్ కర్నూల్ నుంచి పోటీస్తున్నారు. దీంతో ఎంపీ టికెట్ కోసం మందా జగన్నాథం నీలి కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది. కాగా, నాగర్‌కర్నూల్ బీఎస్పీ టికెట్.. ఆ పార్టీ నేతలైన వర్కాల ధనుంజయ్, బండి పృథ్వీరాజ్‌కు వస్తుందని మొదటి నుంచీ ప్రచారం జరిగింది. కానీ చివరికి పార్టీ అధినాయకత్వం మాత్రం మందా జగన్నాథం వైపే మొగ్గుచూపినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.