- దేశశ్రేయస్సు కోసమే భారత్ జూడో యాత్ర
- మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జ్గాలి అనిల్ కుమార్
సామాజిక సారథి, పటాన్చెరు: దేశశ్రేయస్సు కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేపట్టినట్లు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్గాలి అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం ‘సామాజికసారథి’తో మాట్లాడుతూ పేద ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు భారత్ జోడోయాత్ర కొనసాగిస్తున్నారని తెలిపారు. భారత్ జోడో యాత్రలో భాగంగా బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గానికి రానున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై వారికి ఘనస్వాగతం పలికి, భారత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ విజయవంతం చేయగలరని ఆయన పిలుపునిచ్చారు. దేశప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానికే చెందన్నారు. రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరాగాంధీ ఉమ్మడి మెదక్ జిల్లాలో తిరిగిన నేలపై ఆయన భారత్ జోడో యాత్ర ద్వారా పేద ప్రజల ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు వస్తున్నారని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో దేశం, రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని గాలి అనిల్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.