- మాదిగలను తెలంగాణ సీఎం రేవంత్ మోసం చేశారు
- వర్గీకరణ అమలుచేయకుండానే ఉద్యోగాలు ఇచ్చారు
- ఎస్సీ వర్గీకరణను మాల మేధావులు..
- రాజకీయ నాయకులు అడ్డుకుంటున్నారు
- మా పిల్లలకు అవకాశాలు దక్కకుండా చేస్తున్నారు
- మాదిగల ధర్మయుద్ధ మహాసభలో ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ
సామాజికసారథి, మహబూబ్నగర్: మాదిగలకు సీఎం రేవంత్రెడ్డి మోసం చేశారని ఎమ్మార్పీఎస్అధినేత మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణ అమలుచేసే అధికారం రాష్ట్రాలకు ఇచ్చినా అమలు చేయకుండా ఉద్యోగాలను భర్తీచేశారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణను అమలుచేస్తామని చెప్పి, కమిషన్ పేరుతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణ చేసుకునే అవకాశం రాష్ట్రాలకు ఉందని ఆగస్టు 1న సుప్రీంకోర్టు బెంచి తీర్పు చెప్పిందని వివరించారు. వర్గీకరణ అమలు చేయకుండా 11వేల టీచర్ఉద్యోగాలను భర్తీచేయడంతో మాదిగ బిడ్డలు 500కు పైగా జాబ్స్నష్టపోయారని పేర్కొన్నారు. అలాగే మెడికల్కౌన్సెలింగ్లోనూ వర్గీకరణ లేకపోవడంతో మాదిగ బిడ్డలు ఎక్కువ సీట్లను సాధించలేకపోయారని చెప్పారు. గురువారం మహబూబ్నగర్లో జరిగిన మాదిగల ధర్మయుద్ధ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్అధినేత మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. వర్గీకరణ కోసం 3 దశాబ్దాల పోరాటం చేశామన్నారు. ప్రకాశం జిల్లాలోని మారుమూల గ్రామంలో ప్రారంభించామని, ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్నామని గుర్తుచేశారు. జాతి లక్ష్యం కోసం ఎన్నోసార్లు అక్రమ కేసుల్లో జైలుకు వెళ్లామని తెలిపారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొని వర్గీకరణ ఉద్యమాన్ని ముందుకు నడిపామని తెలిపారు. మాదిగ, ఉపకులాలకు దక్కాల్సిన విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయరంగాల్లో మన వాటా మనకు దక్కకుండా మాల మేధావులు, రాజకీయ పదవులను అనుభవిస్తున్నవారు అడ్డుపడుతున్నారని అన్నారు. వర్గీకరణ అమలు జరిగితే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని భావించామని, రాజ్యాంగ ఫలాలకు మన బిడ్డకు అందకుండా కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. పల్లెంలో అన్నం పెట్టుకుని తింటున్న సమయంలో తినకుండా చేస్తున్నారని అన్నారు. మాల మేధావులు కొందరు మనకు అవకాశాలను దక్కకుండా చేస్తున్నారని మండిపడ్డారు.
మరో ధర్మయుద్ధానికి సిద్ధంకావాలి
వర్గీకరణ అమలు చేసుకునేంటేనే మన భవిష్యత్ఉంటుందని ఎమ్మార్పీఎస్అధినేత మందకృష్ణ మాదిగ అన్నారు. తాడోపేడో తేల్చుకునే సమయం వచ్చిందన్నారు. మాలల నుంచి కొందరు స్వార్థపరులు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. 30 ఏళ్లుగా అడ్డుపడుతూనే ఉన్నారని వివరించారు. కానీ జాతి భవిష్యత్ముఖ్యమని, మన పిల్లల భవిష్యత్ముఖ్యమని తాను ఇచ్చే ప్రతి పోరాటానికి కదిలిరావాలని కోరారు. కాంగ్రెస్ను అడ్డుపెట్టుకుని మాలలు మనల్ని అణగదొక్కుతున్నారని, మనమంతా అప్రమత్తంగా ఉండి వర్గీకరణను అమలుచేసుకునే బాధ్యత మన అందరిపై ఉందన్నారు. కమిషన్లు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, సుప్రీంకోర్టు మాదిగలకు అనుకూలంగా తీర్పు చెప్పినా మాలలు ఒప్పుకోవడం లేదన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలను ఆనాటి నుంచి మాలలు అనుభవిస్తున్నారని అన్నారు. వర్గీకరణ జరగనీయమని చెబుతూ మాల ఎమ్మెల్యేలు తిరుగుతున్నారని అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పంజాబ్రాష్ట్రాలు వర్గీకరణకు అనుకూలమేనని చెప్పినా వాళ్లు వినిపించుకోవడం లేదన్నారు. వర్గీకరణ అమలు కోసం ఏ పిలుపు ఇచ్చినా కదిలిరావాలని కోరారు. ఎమ్మార్పీఎస్నాయకులు టైగర్ జంగయ్య, గూట విజయ్, కోళ్ల శివ, కరిగెల దశరథం పాల్గొన్నారు.