- వైన్స్ముందు గంటలకొద్దీ క్యూ లైన్
- కాటన్లు కాటన్లు మద్యం బయటకు..
- భౌతికదూరం పాటించని వైనం
- కరోనా ఎవరికి అంటుకుంటుందోనని టెన్షన్
సారథి, మానవపాడు/రామడుగు/వనపర్తి: ఈనెల 12(బుధవారం) నుంచి తెలంగాణలో లాక్డౌన్ ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో మందు బాబులు మద్యం షాపులకు క్యూ కట్టారు. ఇక మద్యం దొరకదు కావొచ్చు అనుకున్నారేమో పరుగెత్తి దక్కించుకున్నారు. ఒకరికొకరు తోసుకుంటూ ముందుకు సాగుతూ బాటిళ్లను కొన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు, అలంపూర్ చొరస్తా, శాంతినగర్, అయిజ, ఇటిక్యాల చొరస్తా తదితర మండలాల పరిధిలో లోని వైన్స్ వద్ద భౌతిక దూరం పాటించకుండా ఇష్టమొచ్చినట్లు నిలబడి మద్యం బాటిళ్లను దక్కించుకున్నారు. కొన్నిచోట్ల లైన్లలో నిలబడినవారు వైన్స్వద్ద కొని బయటి వ్యక్తులకు ఎక్కువ రేట్లకు అమ్ముకున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో వైన్స్ వద్ద పెద్దసంఖ్యలో తరలివచ్చి క్యూలైన్లలో నిల్చున్నారు. కరోనా నేపథ్యంలో కనీసం భౌతికదూరం కూడా పాటించకపోవడం చర్చనీయాంశమైంది. ఒక్కొక్కరూ సుమారు పదిరోజులకు సరిపడా మందు కొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మద్యం షాపుల దుస్థితి సినిమా థియేటర్ ను తలపించింది. మందు కోసం దుకాణాల ఎదుట క్యూ కట్టారు. కొవిడ్ నిబంధనలను మరిచి మద్యం ప్రియులు భౌతికదూరం మరిచి ఒకరినొకరు నెట్టుకుంటూ తోసుకున్నారు.