Breaking News

పోడు భూములను లాక్కుంటే ఊరుకోం..

పోడు భూములను లాక్కుంటే ఊరుకోం..

సారథి, ములుగు: ఆదివాసీ గిరిజనులకు ఇచ్చిన పోడు భూములను లాక్కుంటే ఊరుకునేది లేదని కాంగ్రెస్ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ భూములకు హక్కు పత్రాలు ఇస్తే ఈ ప్రభుత్వం హరితహారం పేరుతో భూములను లాక్కునే ప్రయత్నిస్తుందన్నారు. ములుగు జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వారం రోజులుగా ములుగు నియోజకవర్గ వ్యాప్తంగా పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

పోడు భూములకు పట్టాలు ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో కేసీఆర్ ​ప్రకటించారని, అధికారంలోకి వచ్చి ఏడేండ్లు గడిచినా ఇప్పటివరకు వాటికి పట్టాలు ఇవ్వకపోగా హరితరం పేరుతో భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులపక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తుందని సీతక్క స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లా నారాయణరెడ్డి, కందిమల్ల మధుసూదన్​రెడ్డి, జడ్పీటీసీ కారోజ్ రమేష్, మాజీ జడ్పీటీసీ బాణోత్ విజయ రూప్​సింగ్, ఎంపీపీ పులుసం పుష్పలత తదిరులు పాల్గొన్నారు.