Breaking News

డెంగీని తరిమేద్దాం

డెంగీని తరిమేద్దాం

సారథి ప్రతినిధి, నాగర్ కర్నూల్: డెంగీ నివారణను మనం మన ఇంటి నుంచే మొదలుపెడదామని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. దోమల నివారణతోనే వ్యాధిని నివారించడం సాధ్యమవుతుందని, ఇంటి ఆవరణలో నీరు నిల్వలేకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. మే16న జాతీయ డెంగీ నివారణ దినాన్ని పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్ క్యాంపు ఆఫీసు ఆవరణలో బ్యానర్, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డెంగీపై జిల్లా ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యాధి సోకితే శరీరంలోని వివిధ అవయవాల్లో తీవ్ర రక్తస్రావమయ్యే అవకాశం ఉందని, తద్వారా మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. లక్షణాల్లో ప్రధానంగా ఉన్నట్టుండి తీవ్ర జ్వరం రావడం, తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనక భాగంలో తీవ్రమైన నొప్పి, కండరాలు, కీళ్లనొప్పులు, ఆకలి మందగించడం, వికారం, వాంతులు కలిగే అవకాశం ఉంటుందన్నారు. డెంగీ నిర్ధారణకు పరీక్షలే కీలకమని కేవలం ప్లేట్ లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ వంటి వాటివి పూర్తిగా శాస్త్రీయం కాదన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో అందుబాటులో ఉండే ఎలిసా పరీక్ష చేయించాలని, డెంగీతో బాధపడుతున్న రోగులు ఉదయం, సాయంత్రం ఒక గ్లాస్ చొప్పున బొప్పాయి పండ్ల రసం, మజ్జిగ, గంజి, ఉప్పు, పంచదార కలిపిన నీరు, బత్తాయి జ్యూస్, దానిమ్మ, ఖర్జురా పండ్లు, కిస్మిస్ తినడం ద్వారా ప్లేట్ లెట్స్ కణాలు పెరుగుతాయని వివరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.సుధాకర్ లాల్, జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి ఆర్.శ్రీనివాసులు, హెల్త్ ఎడ్యుకేటర్ ఓ.శ్రీనివాసులు, డి.కుమార్ పాల్గొన్నారు.