సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకులాలను నడిపించేందుకు ప్రభుత్వం సరైన బడ్జెట్ ఇవ్వలేదు.. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వద్ద భిక్ష అడగాల్సి వచ్చేదని గురుకులాల పూర్వ కార్యదర్శి, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ గుర్తుచేసుకున్నారు. నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని చెప్పుకొచ్చారు. అయినా కూడా ప్రభుత్వం ఇచ్చిన ఒక్కోరూపాయిని జాగ్రత్తగా ఖర్చుపెడుతూ పేదవర్గాల బిడ్డలకు నాణ్యమైన చదువులు అందించగలిగామని వివరించారు. టీఆర్ఎస్ నాయకులు, ముఖ్యమంత్రి, ప్రభుత్వం గురుకులాలకు ఏదో చేశామని, అహో, ఓహో అంటూ డబ్బాలు కొట్టుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న 70లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందా? లేదా? పర్యవేక్షణ లేదన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని తార్నాకలో బీసీ యూత్, అంబేద్కర్, పూలే ఆలోచన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్‌కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రసంగించారు. సీఎం కేసీఆర్ విద్యారంగాన్ని ఏనాడూ పట్టించుకోలేదని, సమీక్షలు జరపలేదని, యూనివర్సిటీలను సందర్శించలేదని, అక్కడ ఉన్న వసతులు ఏమిటో, ప్రమాణాలు ఏమిటో పట్టించుకున్న దాఖలాలు లేవని మండిపడ్డారు. మెడ మీద తలకాయ ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా సరే విద్య మీద ఖర్చుపెట్టాలన్నారు. మన వద్ద లక్షల కోట్లు లేకపోయినా ప్రత్యర్థులకు భయపడకూడదన్నారు. కొండపోచమ్మ, కాళేశ్వరమ్మ, మల్లన్నసాగర్ లాంటి ప్రాజెక్టుల్లో కమీషన్ల ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బును రకరకాల హామీలతో ఎన్నికల్లో ఖర్చుపెడతారని, ఎలాంటి మాయమాటలకు లొంగిపోకూడదని సూచించారు. బహుజన సమాజానికి ఏదో చేయాలనే తపనతోనే తన పదవికి రాజీనామా చేశానని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు.
బహుజన రాజ్యం ఎలా ఉంటుందో చెప్పండి
బహుజన రాజ్యం గురించి మన అవ్వలు, తాతలు, అక్కలు, చెల్లెళ్లకు, డిజిటల్ మీడియా గురించి తెలియని వారికి తెలియజెప్పాలని ఆయన కోరారు. గుడి కట్టిస్తాం, ముక్కునేలకు రాస్తాం, దళితబంధు రూ.10లక్షలు ఇస్తాం వంటి హామీల డబ్బుల వరదలతో కొట్టుకుపోతే తరతరాలుగా అధికారానికి దూరంగా పోతామని హెచ్చరించారు. రాజ్యాధికారం కావాలన్న ఆరాటం ప్రతిఒక్కరిలో ఉండాలని పిలుపునిచ్చారు. అందుకోసం కార్యాచరణ ఈ రోజునుంచే ప్రారంభించాలని పిలుపునిచ్చారు. బంధువులు, సంబంధీకులు, స్నేహితులకు ఏనుగు గుర్తును పరిచయం చేయాలని కోరారు.