- నాగర్ కర్నూల్జిల్లాలో బీజేపీకి నాయకత్వ లోపం
- సరైన లీడర్లేక నిరుత్సాహంలో కేడర్
- కల్వకుర్తిలో ఒంటరి పోరాటం చేస్తున్న టి.ఆచారి
- అచ్చంపేటలో ముందుకెళ్తున్న బంగారు శృతి
రెండు పర్యాయాలు గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతాపార్టీ(బీజేపీ) వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోనూ అధికారంలోకి రావాలని ప్లాన్ చేసుకుంటోంది. క్షేత్రస్థాయిలో ఇప్పటినుంచే కార్యాచరణ ప్రారంభించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వం లేకపోవడంతో కేడర్నిరుత్సాహంతో ఉంది. ఇదే పరిస్థితిని నాగర్ కర్నూల్జిల్లాలోనూ ఎదుర్కొంటోంది.
సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు కొల్లాపూర్నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2018 ఎన్నికల కంటే కొన్ని రోజుల ముందే భారతీయ జనతా పార్టీలో చేరారు. దీంతో పాటు ఆయన స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండటంతో కొద్దిగా ఆ పార్టీకి యువతలో మంచి ఆదరణ పెరిగిందనే చెప్పాలి. నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ప్రతినిత్యం ప్రజల్లో ఏదో ఒక కార్యక్రమం చేపడుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. గెలుపు కోసం చాలా శ్రమించాల్సి ఉంది. అచ్చంపేట, నాగర్ కర్నూల్ నియోజకవర్గాలకు నాయకులు, కార్యకర్తలను నడిపించే బలమైన నాయకుడు లేడనే చెప్పాలి. గత ఎన్నికల్లో స్వతంత్రుల కంటే తక్కువ ఓట్లు తెచ్చుకొని బీజేపీకి డిపాజిట్ దక్కని పరిస్థితి నెలకొంది. ఈ నియోజకవర్గాల్లో మాత్రం కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మంచి చరిష్మా ఉన్న నాయకుడు పోటీచేయడం కానీ ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నాయకుడు బీజేపీలోకి వస్తే తప్ప ఈ నియోజకవర్గాల్లో ఆ పార్టీ పరిస్థితి మారదని, ఇక్కడ పోటీ ఇచ్చే స్థితిలో ఉండబోదని చెబుతున్నారు.
విజయం అందుకోని ఆచారి
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కేవలం కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ కొంత బలంగా ఉంది. అక్కడ కొన్నేళ్లుగా అభ్యర్థిగా పోటీచేస్తున్న తల్లోజు ఆచారి బలమైన నాయకుడు కావడంతో పాటు గత రెండు ఎన్నికల్లో ఆయనకు విజయం అందినట్లే అంది చేజారిపోయింది. ఈ పరిణామం కార్యకర్తలను చాలా నిరుత్సాహానికి గురిచేసింది. ప్రస్తుతం ఆయన జాతీయ బీసీ కమిషన్ సభ్యుడిగా కూడా పనిచేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో పూర్తి సమయం కేటాయించలేకపోతున్నారు. మిగతా నియోజకవర్గాల్లో కేవలం మూడు నాలుగు స్థానాలకే పరిమితం కావాల్సి వస్తోంది.
అచ్చంపేటపై శృతి ప్రత్యేకశ్రద్ధ
ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించిన అచ్చంపేటలో గతంలో బీజేపీకి బలమైన నాయకులు ఉండేవారు. అక్కడ ఆ పార్టీకి గట్టి మూలాలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి చెందిన వనం ఝాన్సీ లాంటి వారు పార్టీ పటిష్టతకు బాగా కృషిచేశారు. అయితే సరైన నాయకత్వం లేకపోవడంతో పార్టీ నానాటికీ తన ప్రభావం కోల్పోతోందని చెప్పొచ్చు. ఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కూతురు, ప్రస్తుతం పార్టీ రాష్ట్రకార్యవర్గంలో క్రియాశీలకంగా పనిచేస్తున్న బంగారు శృతి పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆమె ఈ నియోజకవర్గంపై ప్రత్యేకశ్రద్ధ చూపుతూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అచ్చంపేటను అంటిపెట్టుకొని పనిచేస్తున్నారు.
నాగర్ కర్నూల్ లో వింత పరిస్థితి
జిల్లా కేంద్రమైన నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో బీజేపీ వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. సరైన నాయకత్వం లేక గ్రామాల్లో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న చాలామంది నాయకులు ఏ పార్టీలోకి వెళ్లాలనే యోలోచనలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ దూకుడును ఉపయోగించి వారిని తమ పార్టీలోకి ఆహ్వానించే నాయకులే కరువయ్యారు. కనీసం గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేయలేని పరిస్థితిలో ఉంది. కేవలం జిల్లా కేంద్రంలో ఆర్భాటంగా కార్యక్రమాలు చేయడం, మీడియాకు స్టేట్మెంట్లు ఇవ్వడం తప్ప గ్రామాల్లో ఇక్కడి నియోజకవర్గ ఇన్చార్జ్దిలీప్ఆచారి పర్యటించడం లేదు. చాలావరకు గ్రామాల్లో బీజేపీకి కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. దిలీప్ ఆచారి కొన్ని పర్యాయాలుగా బీజేపీ నుంచి ఎన్నికల్లో పోటీచేస్తున్నా ఇప్పటికి ఆయనకు ఆశిస్తున్న ఫలితాలు మాత్రం దక్కడం లేదు. చాలా గ్రామాల్లో శక్తికేంద్రాల ఏర్పాటు చేసుకోవడంతో పాటు ప్రముఖులను కూడా నియమించుకొని 2023 ఎన్నికల కోసం పనిచేస్తున్నారు. కానీ నాగర్ కర్నూల్జిల్లాలో మాత్రం ఇప్పటివరకు గ్రామ కమిటీలను ఏర్పాటు చేయకపోవడం, చేసినా అవి సరిగ్గా పనిచేయకపోవడంతో పార్టీని నిర్వీర్యం చేస్తున్నారని అంటున్నారు. రాష్ట్ర నాయకత్వం ఈ ప్రాంతంపై దృష్టిసారిస్తే కొంత ఫలితాన్ని ఆశించవచ్చని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.