- తెలంగాణ గడ్డలో రాచరికపోడలు చెల్లవ్
- ఉపఎన్నికలో ఓడించారనే రైతులపై వేదింపులు
- ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
- నల్లగొండ, ఖమ్మం పర్యటనలో ఘన స్వాగతం
సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: తెలంగాణా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అసమర్థ పాలన కొనసాగుతోందని, ఇదే విషయాన్ని సర్వేలు కూడా వెల్లడించాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఆయన ఆదివారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గడ్డమీద ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రాచరికపోకడను ప్రజలు గోరీ కడుతారని, ఆయన అహంకార ధోరణిని కర్రు కాల్చి వాతపెట్టే రోజులు దగ్గర పడ్డాయని దుయ్యబట్టారు. ఇదే విషయం హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించి రుజువు చేశారని ఎద్దేవా చేశారు. అధికార పార్టీని ఓడించారనే కోపంతోనే రైతుల వద్ద ధాన్యం కొనకుండా ఎన్నోరకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఆరుగాలం కష్టించి రైతులు పండించిన పంటను కొనుగోలు చేసే బాధ్యతను కేసీఆర్ ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు. తెలంగాన రాష్ట్రంలో సొంత స్థలాలు ఉన్నవారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2014లో 65వేల కోట్ల రూపాయల అప్పును కేసీఆర్ ప్రభుత్వం ముూఠగట్టుకుందని, కేవలం ఏడు సంవత్సరాలు ఆరునెలల్లోనే రూ.4లక్షల కోట్లకు చేరిందని అన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ కుంటుపడిందని, హాస్టల్ బిల్లులు, ఆరోగ్య బకాయిలు కూడా చెల్లించలేని పరిస్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ రాచరికపు పార్టీని ప్రజలు మట్టిలో కలుపుతారని వ్యాఖ్యానించారు.