Breaking News

ఇదేం న్యాయం?

ఇదేం న్యాయం?

  • ముగ్గురు సంతానం కేసులో జడ్పీ చైర్ పర్సన్ పై అనర్హత తీర్పు
  • తిమ్మాజీపేట జడ్పీటీసీకి నలుగురు సంతానం
  • ఫిర్యాదు చేయని ప్రతిపక్షాలు.. బయటికి ‘అసలు కథ’
  • తాడూరు సొసైటీ చైర్మన్ వివరాలూ వివాదాస్పదం
  • అధికారపార్టీలో చేరడంతో అంతా గప్​చుప్​
  • కందనూలులో చర్చనీయాంశంగా ‘సంతానం పాలిటిక్స్’​

సామాజికసారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: ప్రస్తుత రాజకీయాల్లో కులం అనేది రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది.. ఓట్లు తెచ్చిపెట్టడంలోనూ, విభజించడంలోనూ ప్రధానపాత్ర పోషిస్తోంది.. అదే కులం ఇప్పుడు ఎన్నికల్లో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు అందజేసినా ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేయించింది.. ఇది కేవలం అగ్రకులాలకు మాత్రమే చెందుతోంది. నాగర్ కర్నూల్ జిల్లాలో ఇటీవల ఎన్నికల అఫిడవిట్​లో తప్పుడు వివరాలు సమర్పించారని ఏకంగా జడ్పీ చైర్ పర్సన్​ పైనే ట్రిబ్యునల్ అనర్హత వేటువేసింది. ప్రస్తుతం ఈ అంశం జిల్లావ్యాప్తంగా హాట్​టాపిక్​గా మారింది. కానీ అలాంటి నేతలు జిల్లాలో మరికొందరు ఉన్నా వారిపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని రాజకీయ విశ్లేషకులు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్​పర్సన్ ​అణగారిన వర్గాలకు చెందిన వ్యక్తికావడంతో అదేవర్గానికి చెందిన మరోనేతతో ప్రతిపక్షపార్టీలు కోర్టు కేసులు వేశాయి. కానీ అదే తప్పుడు ధ్రువీకరణ పత్రాలను తిమ్మాజీపేట జడ్పీటీసీ కూడా సమర్పించినట్లు స్థానికంగా కోడై కూశారు. తనకు నలుగురు సంతానం ఉన్నప్పటికీ తప్పుడు వివరాలు సమర్పించిన ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయలేదు. ఒకే నియోజకవర్గంలో ఒకచోట ఇలా.. మరోచోట అలా ప్రవర్తించడం పట్ల ప్రతిపక్ష నేతల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఇక్కడ అణగారినవర్గాలకు చెందిన వ్యక్తి కావడంతోనే ఆమెపై కేసులు పెట్టి అనర్హత వేటు వేయించాలని, అదే ఎమ్మెల్యే సొంత మండలం, స్వగ్రామానికి చెందిన వ్యక్తి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినా అటు కాంగ్రెస్ నుంచి.. ఇటు బీజేపీ నుంచి కానీ కోర్టులో ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. అక్కడ పోటీచేసిన వ్యక్తులంతా ఒకే సామాజికవర్గం, అందులోనూ అగ్రకులనేతలు కావడంతో కులం అనే అంశం కలిసొచ్చిందని విశ్లేషిస్తున్నారు. దీనికి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు చెందిన నియోజకవర్గస్థాయి నేత కూడా ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడంతో ఆయన కూడా సహకరించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అనర్హులకు బీ ఫామ్స్ ​ఎలా?
ఎవరైనా ప్రజాప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేసే ముందు తాము రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉంటామని ప్రమాణం చేస్తారు.. కానీ అదే రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కే పరిస్థితులు ఉంటే వారిని ఏమనాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసేందుకు అనర్హులుగా పరిగణిస్తారు. ఏదో గ్రామస్థాయిలో సర్పంచ్ అంటే అవి పార్టీకి సంబంధం లేకుండా బీ ఫామ్స్​కు పనిలేకుండా పోటీలో ఉంటాయి కాబట్టి అక్కడ అక్కడ పార్టీలకు సంబంధం ఉండదు. కానీ జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా పోటీచేసే వారికి బీ ఫామ్స్ ​ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ నేతలకే ఉంటుంది. అలాంటి నాయకులు పోటీచేసే అభ్యర్థుల వివరాలు తెలియకుండా గుడ్డిగా బీ ఫామ్స్​పంపిణీ చేస్తూ.. ఒకవేళ విషయాలు తెలిసినా కోర్టుతీర్పు వచ్చే వరకు పదవీకాలం ముగిసిపోతుంది. అధికారంలో ఉన్న పార్టీ కనుక తమను ఎవరేం చేయలేరన్న అధికారంతో బీ ఫామ్స్​అందజేస్తున్నారు. అదికూడా జడ్పీటీసీ అంటే మండలస్థాయిలో పోటీచేసే వ్యక్తి వివరాలు పూర్తిగా తెలియకుండా ఇలా పోటీలో నిలబెట్టి చట్టాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం ఏమిటని నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

కేసు పెట్టిస్తారు..!
తిమ్మాజిపేట, తెల్కపల్లి జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక సమయంలోనే ఈ విషయం చర్చనీయాంశమైంది. ఎన్నికల అధికారులకు ఫిర్యాదుచేసినా అధికారపార్టీ నేతలు అవేవి పట్టించుకోకుండా బీ ఫామ్స్ ​ఇచ్చి ప్రస్తుతం తలనొప్పులు తెచ్చుకున్నారు. మరోవైపు బాధ్యతాయుతంగా వ్యవరించాల్సిన ప్రతిపక్ష నేతలు ఒకరికి ఒక మాదిరిగా.. మరొకరి మరో విధంగా వ్యవహరించడం పొలిటికల్​జంక్షన్​లో చర్చనీయాంశమైంది. దీంతో పాటు తాడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ విషయం కూడా వివాదాస్పదమైంది. ఆయనకు కూడా ముగ్గురు సంతానం ఉన్నా మొదట అధికారపార్టీలో లేకపోవడంతో పార్టీ నుంచి పోటీచేయించిన వ్యక్తితో ఫిర్యాదుచేయించి తర్వాత పార్టీలో చేరడంతో ఆయనపై కేసు విత్ డ్రా చేయించారు. అంటే చట్టంలో ఉన్న నిబంధనలను వాడుకుంటూ అధికారపార్టీ తమ స్వలాభం కోసం ప్రయత్నిస్తోందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.