Breaking News

తొక్కాలని చూస్తే.. తాట తీస్తాం

– దళిత, గిరిజనులను అండగా ఉంటాం
– మూడెకరాల భూమి లేదు..
ఎస్సీ వర్గీకరణ చేయలేదు
– టీఆర్​ఎస్​ పాలనలో దళిత ఐఏఎస్​,
ఐపీఎస్​ అధికారులకు అవమానం
– మర్రికి గాలి జనార్దన్​ రెడ్డికి పట్టిన గతే
– పార్టీ ఎవరికి అవకాశమిచ్చినా
భుజాలపై మోసుకెళ్లి కుర్చీపై కూర్చోబెడతా
– బిజినేపల్లి దళిత గిరిజన ఆత్మగౌరవ సభలో
టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి ఫైరింగ్​ స్పీచ్​
– హాజరైన కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్ రావు ఠాక్రే

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​ బ్యూరో: రాష్ట్రంలో దళిత గిరిజనులపై జరుగుతున్న దాడులను చూస్తూ ఊరుకునేది లేదని టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి హెచ్చరించారు. భూస్వాములు, దొరలు దళితులపై దాడులు చేస్తుంటే వారిని దిగంతాలను తరిమిన చరిత్ర ఈ గడ్డదని గుర్తుచేశారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి.. దరిద్రుడు సీఎం అయ్యారని, దళితులకు మూడెకరాల భూమి, ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పిన సీఎం.. ఏమీ చేయలేదు కానీ దళిత గిరిజనుల గొంతుపై కాలు పెట్టి తొక్కిస్తున్నారని విమర్శించారు. ఎన్నికలొస్తున్నాయ్ బిడ్డా.. నీ నడినెత్తిన కాలు పెట్టి తొక్కి జనం నిన్ను పాతాళంలోకి పంపిస్తారని హెచ్చరించారు. నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లిలో ఆదివారం కాంగ్రెస్​ పార్టీ నిర్వహించిన జరిగిన దళిత, గిరిజన ఆత్మగౌరవ సభకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క, మాజీ సీఎల్పీ లీడర్ కె.జానారెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ చల్లా వంశీచంద్​ రెడ్డి, మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్​ జి.చిన్నారెడ్డి, మాజీఎంపీ మల్లు రవి, షబ్బీర్ అలీ, సంపత్​ కుమార్​ హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. ‘ఈ తెలంగాణ, పాలమూరు గడ్డ ఇంకా దొరలు దళిత, గిరిజనులపై కాలుపెట్టి తొక్కి ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు. నాలుగేళ్లయినా ఇక్కడ కడతామన్న ప్రాజెక్టు అడుగు ముందుకు పడలేదు. ప్రాజెక్టు పనుల పరిశీలనకు వెళ్తే నాగం జనార్దన్ రెడ్డిపై కేసులు పెట్టిర్రు. హామీలు నిలబెట్టుకోని ఈ ప్రభుత్వాన్ని నిలదీసేందుకే నాగం జనార్దన్ రెడ్డి అక్కడికి వెళ్లారు. పాలమూరును పచ్చగా చేయాలని జూరాల, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. మేం కట్టిన ప్రాజెక్టుల వద్ద ఇక్కడ ఎమ్మెల్యే ఫొటోలు దిగుతున్నారు. ప్రాజెక్టుల విషయంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమే. పంచెలు కట్టిన ప్రతివాడు వైఎస్ రాజశేఖరరెడ్డి కాలేడు. బీఆర్ఎస్​ నిర్లక్ష్యం వల్లే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ఒక్క అడుగు ముందుకు పడలేదు. గతంలో నాగం జనార్దన్ రెడ్డి సంగతి చూస్తానన్న గాలి జనార్ధన్ రెడ్డికి చిప్పకూడే గతి అయింది. ఇప్పుడు ఇక్కడున్న ఈ తిర్రి జనార్దన్ రెడ్డి పరిస్థితి కూడా అంతే.. శిశుపాలుడికి పట్టిన గతే ఈ తిర్రికి పడుతుంది.’ అని టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి అన్నారు.

దళిత అధికారులకు అవమానాలు
‘పాలమూరు బిడ్డ, ఐపీఎస్​ అధికారి డాక్టర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్ కేసీఆర్​ వద్ద అవమానాలు భరించలేక ఆయన ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చారు. సీనియర్​ ఐఏఎస్​ అధికారి అకునూరి మురళి అవమానం భరించలేక రాజీనామాను కేసీఆర్​ ముఖాన కొట్టి వచ్చారు. కృష్ణప్రసాద్​.. డీజీపీ అయ్యేందుకు అవకాశం లేకుండా చేశారు. ప్రదీప్​ చంద్ర.. సీఎస్​ కాకుండా చేశారు. మందకృష్ణ జైలులో పెట్టారు. బిజినేపల్లిలో రాములు వీపు పగులగొట్టారు. ఓట్లు మీవి సీటు దొరలకా? ఇకపై చెల్లదు. పేదలకు అండగా నిలబడతాం. తెలంగాణ తరలి బిజినేపల్లికి వచ్చింది. పేదోడికి ప్రగతి భవన్ లో చోటులేదు. డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ కు దండవేయనోడు ముఖ్యమంత్రి అయిండు. సమైక్యపాలనలో పొలిమేర్లు దాటించిన చర్రిత తెలంగాణకు ఉంది. దళితులు, గిరిజనులు చైతన్యమై కలిసిరావాలి. కాంగ్రెస్​ ను అధికారంలోకి తీసుకురావాలి.’ అని కాంగ్రెస్​ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి అన్నారు.

మీ బిడ్డకు గొప్ప అవకాశమిచ్చారు
‘మాకు మాకు కొట్లాలు లేవు. నే మీ బిడ్డను. ఈ మట్టిలోనే పుట్టిలో పుట్టా. చివరికి ఈ మట్టిలోనే కలిసిపోతా. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మీ బిడ్డకు గొప్ప అవకాశమిచ్చారు. మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్​ పార్టీకి అధ్యక్షుడిగా చేశారు. సీఎల్పీ లీడర్​ గా మల్లు భట్టి విక్రమార్కను చేశారు. గతంలో బాల్​ రాం నాయక్​ ను కేంద్రమంత్రిగా చేశారు. కానీ టీఆర్​ఎస్ లో దళితులకు మంత్రి పదవి దక్కలేదు. ఇది దొరల పార్టీ. దళిత, గిరిజనులకు కాంగ్రెస్​ పార్టీ ఉంది. ఈ పార్టీ మీది.. కాపాడుకోండి.’ అని టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి అన్నారు. ‘రాష్ట్రంలో దళిత గిరిజనులను బీఆర్​ఎస్ నేతలు అవమానిస్తున్నారు. దొరలకు బీఆర్​ఎస్, పెట్టుబడిదారులకు బీజేపీ ఉంది. కానీ దళిత గిరిజనులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. ఈ పార్టీ మీది.. ఈ జెండా మీది.. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. పాలమూరులో 14కు 14 సీట్లు గెలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరేసే బాధ్యత నాది. పార్టీ ఎవరికి అవకాశమిచ్చినా వారిని భుజాలపై మోసుకెళ్లి కుర్చీపై కూర్చోబెట్టే బాధ్యత నాది. దళిత, గిరిజన, ఆదివాసీ, బడుగు బలహీనవర్గాలు కలిసికట్టుగా కాంగ్రెస్ ను గెలిపించాలి. నేను మీ బిడ్డను ఈ పాలమూరు జిల్లా నల్లమల బిడ్డను. నన్ను పీసీసీ అధ్యక్షుడిగా చేశారు సోనియా గాంధీ. ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలన్నా కొండారెడ్డిపల్లి నుంచి నేను ఒక్క సంతకం పెట్టి బీఫామ్ ఇచ్చే అధికారం నాకు ఇచ్చారు. ’ అని టీపీసీసీ రేవంత్​ రెడ్డి అన్నారు.

దళిత, గిరిజనులపై దాడులు సహించేదిలేదు
ఆత్మగౌరవం కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా దళిత, గిరిజనులపై దాడులు, అవమానాలు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క హెచ్చరించారు.
అపార రాజకీయ అనుభవం కలిగిన మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి మార్కండేయ ప్రాజెక్టు సందర్శనకు వెళ్తుండగా ఆయన వెంట వెళ్లిన గిరిజనుడు వాల్యానాయక్, దళిత నాయకుడు రాములును కింద పడవేసి మెడపై కాలు వేసి తొక్కిన దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన ధైర్యంతోనే ఈ దుశ్చర్యకు ఒడిగట్టారని అన్నారు. వారిపై జరిగిన దాడిని తెలంగాణ ఆత్మగౌరవ పోరాట సమస్యగా భావిస్తున్నామని అన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు మల్లు అనంతరాములు లాంటి పెద్ద నాయకులు ఈ పార్లమెంటు స్థానానికి ప్రాతినిథ్యం వహించారని గుర్తుచేశారు. సామాజిక న్యాయం కావాలని తిరుగాడిన ఈ గడ్డపై దళితులపై జరిగిన దాడిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పోలీసులు ప్రభుత్వం చెప్పు చేతుల్లో పనిచేయకూడదని హితవుపలికారు. బిహార్​ దళితులపై ఊచకోత జరిగినప్పుడు స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ అక్కడికి వెళ్లి తాను ఉన్నానని ధైర్యం చెప్పింది. అదే స్ఫూర్తితో తెలంగాణలో దళితులకు, గిరిజనులకు ఎక్కడ అవమానాలు జరిగిన, అన్యాయం జరిగిన కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కార్యక్రమంలో నాగర్​ కర్నూల్​ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్​ చిక్కుడు వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కొల్లాపూర్​ ఇన్​ చార్జ్​ అభిలాష్​ రావు, పీజేఆర్​ విజయలక్ష్మి, డీసీసీ కార్యదర్శి అర్థం రవి, ఉమ్మడి మహబూబ్​ నగర్​ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.