Breaking News

మేం తలచుకుంటే గ్రామాల్లో తిరగరు

మేం తలచుకుంటే గ్రామాల్లో తిరగరు

  • చందాలు ఇవ్వలేదనే బీఎస్పీ నేతల అసత్య ప్రచారం
  • 30ఏళ్లలో జరగని అభివృద్ధి.. 7ఏళ్లలో జరిగింది
  • నల్లమట్టితో ఎమ్మెల్యేకు సంబంధం లేదు
  • ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు మంగి విజయ్​

సామాజిక సారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్ నియోజకవర్గంలో బహుజన సమాజ్​పార్టీ(బీఎస్పీ) నాయకులు పాలమూరు- రంగారెడ్డి రిజర్వాయర్ పనులు చేపడుతున్న కంపెనీ కాంట్రాక్టర్ ​వద్ద చందాలు అడుగుతున్నారని, వారు చందాలు ఇవ్వకపోవడంతోనే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు మంగి విజయ్, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.. మీకు చందాలు ఇవ్వనంత మాత్రాన నల్లమట్టిని అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తారా? అని ప్రశ్నించారు. ఇలాగే కొనసాగితే నియోజవర్గంలోని ఏ గ్రామంలో కూడా బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు తిరగలేరని వార్నింగ్​ ఇచ్చారు. ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తే నియోజవర్గంలో వారికి పుట్టగతులుండవని హెచ్చరించారు. గురువారం నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి ఎంపీడీవో కార్యాలయంలో టీఆర్ఎస్ ​నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 30ఏళ్లలో ఏ అభివృద్ధి చేయని పాలకులను విమర్శించలేదని, ఏడేళ్లలో ఎంతో అభివృద్ధి చేసిన ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారని వారు అన్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హయాంలోనే మెడికల్ కాలేజీ వచ్చిందని, ట్యాంక్ బండ్ పనులు, అండర్ డ్రైనేజీ వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని పేర్కొన్నారు.

పేదింటి వారికి పెద్దకొడుకుగా ఉండి తన సొంత డబ్బులతో పెళ్లిళ్లు చేసిన ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ఎమ్మెల్యేను ఏకవచనంతో మాట్లాడిన నేతలు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పాలమూరు- రంగారెడ్డి రిజర్వాయర్ రైతులకు వరం లాంటిదని, ఎమ్మెల్యే ముందుండి పరిహారం కోసం ప్రభుత్వంతో కొట్లాడి ఇప్పించేందుకు ఎంతో కృషిచేశారని కొనియాడారు. నల్లమట్టి అనేది ప్రాజెక్టుకు అవసరమే తప్ప ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదన్నారు. జిల్లాలో పాలన అధికారిగా జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖ ఇరిగేషన్ అధికారులు ఉన్నారని, వారిని అడిగి అవగాహన కల్పించుకోవాలి హితవు పలికారు. సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు గంగనమోని తిరుపతయ్య సర్పంచ్​లు రామ్ నాయక్, చందూలాల్, వంశీ, చెన్నయ్య, బోనాసి రామకృష్ణ, వెంకటేశ్, విజయ్ కాంత్ తదితరులు పాల్గొన్నారు.