Breaking News

ఎంతకాలం యాచకులుగా బతకుదాం

ఎంతకాలం యాచకులుగా బతకుదాం

  • 75 ఏళ్ల పాలనలో సరైన బట్టలు కూడా లేవు
  • మేం అధికారంలోకి వస్తే అన్ని కులాలకు సమన్యాయం
  • బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

సామాజికసారథి, హైదరాబాద్: ఇంకెంత కాలం మనం యాచకులుగా బతకుదామని, ఎంతకాలం కూలీలుగా బతుకుదామని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. 75 ఏళ్ల పాలనలో సంచార జాతులకు వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేవని ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్యాధికార యాత్రలో భాగంగా తిరిగిన అన్నిగ్రామాల్లోనూ సంచార జాతుల దయనీయ పరిస్థితిని తాను చూశానని వివరించారు. అందుకే సంచారజాతులకు న్యాయం జరగాలంటే బహుజనులకు రాజ్యాధికారం రావాలని కోరారు. అందుకు బహుజన కులాలన్ని ఏకం కావాలని ఆయన​పిలుపునిచ్చారు. సంచారజాతులకు విద్య, ఉద్యోగం, ఉపాధి, రాజకీయ రంగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించాలనే న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కులో వద్ద జరిగిన మహాధర్నాకు డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జనాభా దామాషా ప్రకారం ఎవరివాటా వారికి పంచడానికే బీఎస్పీ పుట్టిందన్నారు. మహనీయులు కాన్షీరాం నాడు పోరాటం చేసి మండల్ కమిషన్ ఏర్పాటుకు కృషిచేశారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు బీసీల లెక్కలు తేల్చకుండా, ఆర్థికంగా వెనకబడిన కులాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించి, సంచార జాతులకు న్యాయం చేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ మీటింగ్ కు వచ్చిన నాయకులే మీకు న్యాయం చేసే మనసున్న నాయకులని గుర్తుపెట్టుకోవాలని, ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే దొంగల పార్టీలను తరిమేయాలని పిలుపునిచ్చారు. మన ఓట్లు మనం వేసుకోని మనమే పాలకులమైతే అన్నిరంగాల్లో మన వాటా మనకు దక్కుతుందన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మీకు ఎంత వాటా కావాలో మీ జనాభా ప్రాతిపదికన మీరే తీసుకోవచ్చని, బీ ఫారాలు తీసుకుని పోటీచేయొచ్చని పేర్కొన్నారు.

రాజిరి పుస్తకావిష్కరణ
అనంతరం బాగ్​లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ‘రాజిరి (నిక్కమైన నీలిరత్నం) పుస్తకాన్ని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రజాగాయకుడు గద్దర్, నల్లా సూర్యప్రకాశ్, రాములు, పసునూరి దయాకర్​ పాల్గొన్నారు.

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న డాక్టర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​, గద్దర్​ తదితరులు