- తక్షణమే రూ.రెండువేల కోట్ల నిధులు విడుదల చేయాలి
- ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష
సారథి న్యూస్, హైదరాబాద్: వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, దుర్భిక్షానికి నెలువైన రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించే పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరి నాటికి వందశాతం పూర్తిచేయాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఫ్లోరైడ్, వర్షాభావ పరిస్థితులు ఉన్న నల్లగొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు అందించే డిండి ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచి, ఆరు నెలల్లోగా పూర్తిచేయాలని సూచించారు. ఈ రెండు ప్రాజెక్టులకు నిధుల వరద ఆగవద్దని, ఈ ఏడాది బడ్జెట్లో కూడా నిధులు కేటాయిస్తామని సీఎం స్పష్టంచేశారు. శనివారం పాలమూరు – రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు పనుల పురోగతిపై ప్రగతి భవన్ లో విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే సురేందర్ తదితరులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉదండాపూర్ నుంచి ఎగువ ప్రాంతాలకు నీరందించే మార్గానికి సంబంధించి తుది డిజైన్లు రూపొందించాలని ఆదేశించారు. కల్వకుర్తి, బీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు పూర్తి చేయడం ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలు, జూరాలతో కలిపి 11.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగయ్యేదని, ఇప్పుడు కోటి పదిలక్షల ఎకరాలకు పెరిగిందని సీఎం కేసీఆర్వివరించారు. సాగునీటి వసతి పెరగడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. సాగునీరు అందించడంతో పాటు మిషన్ భగీరథకు కావాల్సిన నీరు, పరిశ్రమలకు నీరు అందించే బాధ్యత కూడా నీటిపారుదల శాఖకే ఉందన్నారు. నీటిపారుదల శాఖను ప్రభుత్వం ఇటీవల పునర్వ్యవస్థీకరించిందని, ఈ విభజన, ఆయా అధికారులకు నిర్ణయించిన పరిధి సౌకర్యవంతంగా, పనులు చేయడానికి అనువుగా ఉందో లేదోననే విషయంపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సూచించారు.
– పాలమూరు – రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పనులకు వెంటనే బిల్లులు చెల్లించడానికి తక్షణం రూ.రెండువేల కోట్ల విడుదల చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు.
– ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణను పూర్తిచేసి తక్షణం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని నాగర్ కర్నూల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను కోరారు.
–బీహెచ్ఈఎల్ అధికారులతో సమావేశమై అవసరమైన మోటార్లను వెంటనే తెప్పించి, బిగించే పనులను పర్యవేక్షించాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ ను కోరారు. విద్యుత్ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయంతో వ్యవహరించాలని కోరారు.
– ప్రతి ఏడాది ముందుగా అన్ని చెరువులు నింపాలని సూచించారు.
– మిషన్ భగీరథకు నీళ్లు ఇవ్వడానికి వీలుగా అన్ని రిజర్వాయర్లలో మినీమమ్ డ్యామ్ డ్రాయింగ్ లెవల్ ను మెయింటేన్ చేయాలని కోరారు. సమావేశంలో నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్, నీటి పారుదలశాఖ సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీ మురళీధర్ రావు, సీఈలు మోహన్ కుమార్, రమేశ్, రఘునాథరావు, ఎస్ఈలు ఆనంద్, విజయభాస్కర్ రెడ్డి, ఉమాపతిరావు, సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.