- ఉద్దండాపూర్ గ్రామస్తులకు న్యాయం చేయాలి
- సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రైతులతో ముఖాముఖి
సారథి న్యూస్, జడ్చర్ల: నాటి ఇందిరమ్మ ప్రభుత్వం దళిత, గిరిజన పేదప్రజలకు భూములు ఇస్తే సీఎం కేసీఆర్ గుంజుకుంటున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామంలో పర్యటించారు. రైతులతో మాట్లాడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్దండాపూర్ గ్రామస్తులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కచ్చితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా భూసేకరణ చట్టం 2013 ప్రకారమే బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఉద్దండాపూర్ రిజర్యాయర్ లో భాగంగా ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టించాలని, భూములు కోల్పోయిన వారికి భూములు, అదే దళిత గిరిజనులకు రెండింతల భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వాల్సి వస్తే మార్కెట్ రేటుకు మూడింతలు ఇవ్వాలన్నారు. గ్రామప్రజలకు వివరాలు చెప్పకుండా సర్వే చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఉద్దండాపూర్ సభలో సీఎం కేసీఆర్ హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. గ్రామస్తులను ఖాళీచేయించడం కుదరదన్నారు. కార్యక్రంలో మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్ చైర్మన్ కోదండరెడ్డి, తెలంగాణ కిసాన్ సెల్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మహబూబ్ నగర్ డీసీసీ ప్రెసిడెంట్ ఒబేదుల్లా కొత్వాల్, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీ చంద్ రెడ్డి పాల్గొన్నారు.