- క్రిస్మస్ వేడుకల్లో ప్రకటించిన మంత్రి సత్యవతి రాథోడ్
సామాజిక సారథి, మహబూబాబాద్: డోర్నకల్ ప్రజలు నన్ను వారి ఆడబిడ్డగా భావించి ఎప్పుడూ ఆదరించారని, ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత తనదేనని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. డోర్నకల్‌లోని సీఎస్‌ఐ చర్చిలో గురువారం జరిగిన 38వ ఆలోచన మహాసభల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘నేను 10 తరగతి చదవడానికి ఇక్కడ బిషప్ స్కూల్‌కు వచ్చాను. కానీ అదే సమయంలో రాజకీయాల్లోకి వచ్చాను. డోర్నకల్ ప్రజలు నన్ను వారి బిడ్డగా భావించి ఎప్పుడూ ఆదరించారన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో మొదటి మహిళా మంత్రిగా మహిళా సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖల మంత్రిగా ఉండడం నా పూర్వ జన్మ సుకృతం. అన్ని మతాలు, కులాల్ని గౌరవించే గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్”అని అన్నారు. అందుకే క్రిస్మస్ సందర్భంగా విందులు ఏర్పాటు చేసి, దుస్తులు పంపిణీ చేసే గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జెడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి, టీ.ఆర్.ఎస్ నేతలు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కాలం రవీందర్ రెడ్డి, సురేష్ ప్యాట్ని, మోయిన్ పాషా, తాళ్లూరి హనుమ, ఇతర నాయకులు పాల్గొన్నారు.