Breaking News

30 దాకా సెలవులు

30 దాకా సెలవులు
  • కరోనా నేపథ్యంలో సర్కారు నిర్ణయం
  • 16న ముగిసిన సంక్రాంతి హాలీ డేస్​
  • మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా
  • విద్యాసంస్థలకు పొడిగింపు
  • మెడికల్​కాలేజీలకు మినహాయింపు
  • సెలవులు రద్దుచేయాలని ఉపాధ్యాయ, ప్రైవేట్​స్కూళ్ల యాజమాన్యాల డిమాండ్​
  • పిల్లల చదువులపై పేరెంట్స్​ఆందోళన

సామాజికసారథి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నది. మెడికల్​కాలేజీలకు మినహాయింపు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8వ తేదీ నుంచి ప్రకటించిన సంక్రాంతి సెలవులు 16వ తేదీతో ముగియనున్నాయి. అయితే రాష్ట్రంలో ఓ వైపు ఒమిక్రాన్, మరో వైపు కొవిడ్ కేసుల వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో సెలవులను పొడిగించాలని విద్యాశాఖకు వైద్యారోగ్య శాఖ సిఫార్సు చేసింది. ఈ క్రమంలోనే ఆరోగ్యశాఖ సూచనల మేరకు ఈనెల 30 వరకు సెలవులను  పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు.

  • ర్యాలీలు, సభలపై ఆంక్షలు

ఈనెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో ర్యాలీలు, సభలను జరపకూడదని పేర్కొన్నారు. వాటికి సంబంధించిన ఉత్తర్వులను 9న రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది.దీంతో సెలవులను కూడా మొదట 20వ తేదీ వరకు పొడిగిస్తారని భావించారు. ఎక్కువ రోజులు పొడిగిస్తే సర్కారు స్కూళ్లు, జూనియర్‌ కాలేజీల విద్యార్థులకు టీవీల ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలను ప్రసారం చేయాల్సి ఉంటుంది. లేకుంటే అటు ప్రత్యక్ష తరగతుల్లేవు.. ఇటు ఆన్‌లైన్‌ పాఠాలు లేవన్న విమర్శలు వస్తాయని అధికారులు భావించారు. విద్యాశాఖ మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను కచ్చితంగా అమలు చేస్తామని గతంలోనే పేర్కొన్నది. అయితే సెలవులను పొడిగిస్తారా? లేదా? అనేది త్వరగా ప్రకటిస్తే సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి రావాలా? అక్కడే ఉండాలా? అన్నది నిర్ణయించుకుంటామన్న అభిప్రాయాన్ని కొందరు పేరెంట్స్​సైతం వ్యక్తం చేశారు. తాజాగా సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో స్పష్టత వచ్చింది. 

  • నేడు కేబినెట్​భేటీ

సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సోమవారం ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరగనుంది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం, కరోనా ఉధృతి కొనసాగుతుండటంతో అన్నిరకాల విద్యాసంస్థలకు జనవరి 30వ తేదీ వరకు సెలవులు పొడగిస్తూ సీఎం కేసీఆర్​ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో కరోనా నేపథ్యంలో వ్యాపార, వాణిజ్యరంగాలకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకొనే చర్యలను ఈ సమావేశంలో చర్చించనున్నారు.

  • విద్యాసంస్థలకు సెలవు రద్దు చేయాలి

సామాజిక సారథి, సిద్దిపేట: విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, విద్యార్థులకు విద్యనందిస్తున్నాయన్నారు. సంక్రాంతి పండుగ సెలవుల పేరుతో పాఠశాలకు ప్రభుత్వం ముందుగానే సెలవులు ప్రకటించిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నిబంధనలకు విరుద్దంగా షాపింగ్ మాల్స్, వైన్స్, బార్లు, క్లబ్బులు, మార్కెట్స్, సినిమా థియేటర్లు, పార్కులు, రాజకీయ నాయకుల మీటింగ్స్ కరోనా విజృంభణకు కేంద్రాలుగా మారుతున్నాయని ఆరోపించారు. ఓవైపు ప్రభుత్వం ఇస్తున్న సూచనలు తూచతప్పకుండా పాటిస్తూనే, మరోవైపు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై ప్రభుత్వ సెలవులు ప్రకటించడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈనెల 30వరకు పొడిగించిన సెలవులను రద్దు చేసి, నష్టాల్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో (ట్రాస్మా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాదుల మధుసూదన్, రాష్ట్ర కోశాధికారి ఐవి. రమణరావు, (ట్రస్మా) యాజమాన్య కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు