- రోడ్డు ప్రమాదంలో కొడుకు దుర్మరణం
- మృత్యువుతో పోరాడుతున్న భర్త
- వైద్యం కోసం రూ.20లక్షలు అవసరం
- సోషల్ మీడియా ద్వారా సాయం కోసం..
- వేడుకున్న కస్తూర్బా స్కూలు టీచర్
- 2 రోజుల్లోనే రూ.32లక్షలు సాయం చేసిన దాతలు
సారథి, గద్వాల(మానవపాడు): మృత్యువు రూపంలో వచ్చిన కారు ఆమె కొడుకును బలితీసుకుంది.. భర్తను చావు అంచులదాకా తీసుకెళ్లింది. ఓ వైపు దు:ఖాన్ని పంటిబిగువున దాచుకుంది. మరోవైపు ప్రాణాపాయస్థితిలో ఉన్న భర్తను కాపాడుకొనేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. చివరికి సోషల్‌మీడియా వేదికగా దాతలు స్పందించి సుమారు రూ.30లక్షల ఆర్థిక సహాయం అందజేసి ఆమె భర్తకు ఊపిరిపోశారు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో సంచలనం మారింది. గద్వాల పట్టణంలోని ఎర్రమట్టి వీధికి చెందిన మున్నీ గోనుపాడు కస్తూర్బాగాంధీ విద్యాలయంలో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం భర్త నవీన్, కొడుకు అఖిలేశ్రాజు(8) కలిసి ఆమెను బైక్‌పై తీసుకెళ్లి విద్యాలయంలో వదిలిపెట్టి తిరుగు పయనమయ్యారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే సంగాల చెరువుకట్ట సమీపంలో కర్ణాటక నుంచి గద్వాల వైపునకు వెళ్తున్న ఓ కారు అతివేగంగా వచ్చి వీరి బైక్‌ను వెనక నుంచి ఢీకొట్టింది. చిన్నారి అఖిలేశ్రాజు అక్కడికక్కడే చనిపోయాడు. ఉన్సీ భర్త నవీన్తలకు గాయమై అపస్మారకస్థితికి చేరుకున్నాడు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారును డ్రైవర్వదిలేసి వెళ్లిపోయడు.
సోషల్ మీడియా వేదికగా..
తన భర్తను ఎలాగైనా బతికించాలని, ఆపరేషన్‌కోసం రూ.20లక్షల ఖర్చవుతుందని మున్సీ తన సహచర ఉపాధ్యాయులు, స్నేహితుల వద్ద కన్నీరుమున్నీరైంది. దీంతో వారు వెంటనే సోషల్‌మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు విలేకరులను కలిసి వేడుకున్నారు. తన అకౌంట్లో మీకు తోచినంత డబ్బు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయం కాస్త వైరల్కావడంతో వందలాది మంది స్పందించారు. బుధవారం ప్రమాదం చోటుచేసుకోగా, శుక్రవారం సాయంత్రంలోగా ఎవరికివారు తమకు తోచినంతా గూగుల్ పే, ఫోన్ పే ద్వారా రూ.30లక్షలపైగా ఆర్థిక సహాయం అందజేశారు. తనకు సహాయం అందజేసి తన భర్త ప్రాణాలు నిలిపిన వారికి మున్సీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. కొడుకు ఇక లేడనే చేదు నిజం ఓ వైపు గుండెను పిండేస్తోంది. భర్తను ఎలాగైనా బతికించుకోవాలన్న ఆమె తపనకు మనమూ చేయూతనందిద్దాం.