Breaking News

బిడ్డ దక్కకపోయినా భర్తను కాపాడుకుంది..

బిడ్డ దక్కకపోయినా భర్తను కాపాడుకుంది..
  • రోడ్డు ప్రమాదంలో కొడుకు దుర్మరణం
  • మృత్యువుతో పోరాడుతున్న భర్త
  • వైద్యం కోసం రూ.20లక్షలు అవసరం
  • సోషల్​ మీడియా ద్వారా సాయం కోసం..
  • వేడుకున్న కస్తూర్బా స్కూలు టీచర్​
  • 2 రోజుల్లోనే రూ.32లక్షలు సాయం చేసిన దాతలు

సారథి, గద్వాల(మానవపాడు): మృత్యువు రూపంలో వచ్చిన కారు ఆమె కొడుకును బలితీసుకుంది.. భర్తను చావు అంచులదాకా తీసుకెళ్లింది. ఓ వైపు దు:ఖాన్ని పంటిబిగువున దాచుకుంది. మరోవైపు ప్రాణాపాయస్థితిలో ఉన్న భర్తను కాపాడుకొనేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. చివరికి సోషల్​మీడియా వేదికగా దాతలు స్పందించి సుమారు రూ.30లక్షల ఆర్థిక సహాయం అందజేసి ఆమె భర్తకు ఊపిరిపోశారు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో సంచలనం మారింది. గద్వాల పట్టణంలోని ఎర్రమట్టి వీధికి చెందిన మున్నీ గోనుపాడు కస్తూర్బాగాంధీ విద్యాలయంలో తెలుగు టీచర్​గా పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం భర్త నవీన్, కొడుకు అఖిలేశ్​రాజు(8) కలిసి ఆమెను బైక్​పై తీసుకెళ్లి విద్యాలయంలో వదిలిపెట్టి తిరుగు పయనమయ్యారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే సంగాల చెరువుకట్ట సమీపంలో కర్ణాటక నుంచి గద్వాల వైపునకు వెళ్తున్న ఓ కారు అతివేగంగా వచ్చి వీరి బైక్​ను వెనక నుంచి ఢీకొట్టింది. చిన్నారి అఖిలేశ్​రాజు అక్కడికక్కడే చనిపోయాడు. ఉన్సీ భర్త నవీన్​తలకు గాయమై అపస్మారకస్థితికి చేరుకున్నాడు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​కు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారును డ్రైవర్​వదిలేసి వెళ్లిపోయడు.

కేజీబీవీ టీచర్​ మున్నీ బ్యాంకు ఖాతాకు దాతలు పంపించిన ఆర్థిక సహాయం

సోషల్​ మీడియా వేదికగా..
తన భర్తను ఎలాగైనా బతికించాలని, ఆపరేషన్​కోసం రూ.20లక్షల ఖర్చవుతుందని మున్సీ తన సహచర ఉపాధ్యాయులు, స్నేహితుల వద్ద కన్నీరుమున్నీరైంది. దీంతో వారు వెంటనే సోషల్​మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు విలేకరులను కలిసి వేడుకున్నారు. తన అకౌంట్​లో మీకు తోచినంత డబ్బు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయం కాస్త వైరల్​కావడంతో వందలాది మంది స్పందించారు. బుధవారం ప్రమాదం చోటుచేసుకోగా, శుక్రవారం సాయంత్రంలోగా ఎవరికివారు తమకు తోచినంతా గూగుల్​ పే, ఫోన్​ పే ద్వారా రూ.30లక్షలపైగా ఆర్థిక సహాయం అందజేశారు. తనకు సహాయం అందజేసి తన భర్త ప్రాణాలు నిలిపిన వారికి మున్సీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. కొడుకు ఇక లేడనే చేదు నిజం ఓ వైపు గుండెను పిండేస్తోంది. భర్తను ఎలాగైనా బతికించుకోవాలన్న ఆమె తపనకు మనమూ చేయూతనందిద్దాం.