- ఏకమైన వాగులు, వంకలు..
- నిండుకుండలా చెరువులు, కుంటలు
- లోతట్టు ప్రాంతాలు జలమయం
- పలుచోట్ల వాగుల్లో కొట్టుకుపోయినవారిని కాపాడిన పోలీసులు
సారథి ప్రతినిధి, జగిత్యాల/జగిత్యాల రూరల్/వేములవాడ/పెద్దశంకరంపేట/నాగర్కర్నూల్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణమ్మ, గోదావరి నదుల్లోకి నీటి ఉధృతి పెరిగింది. రెండు రోజులుగా ఎడాతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. కుండపోత వర్షాలకు పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జగిత్యాల రూరల్ మండలం అనంతరం- గుల్లపేటవాగు పైనుంచి వెళ్తుండగా వరద ఉధృతికి కారు కొట్టుకుపోయి ఇద్దరు వ్యక్తులు వాహనంలోనే చిక్కుకున్నారు. అక్కడే ఉన్న జగిత్యాల రూరల్ సీఐ క్రిష్ణకుమార్, ఉప సర్పంచ్ మహేష్ తాడు సహాయంతో వెంటనే వాగులోకి దూకి కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను కాపాడారు. జగిత్యాల – ధర్మపురి మార్గంలో అనంతరం వద్ద లోలెవల్ వంతెనపై వరదనీరు పొంగిపోర్లుతోంది. గురువారం ఉదయం నుంచి వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో పోలీసులు రోడ్డు మార్గాన్ని బారీకేడ్లతో మూసివేసి వాహనాలను నియంత్రిస్తున్నారు. జగిత్యాల నుంచి మంచిర్యాల వెళ్లే రహదారి ఎన్ హెచ్ నం.63 పైనుంచి వరద పారుతోంది. వంతెన మునిగిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
వాగులో చిక్కిన 14 మందిని కాపాడిన పోలీసులు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిసర ప్రాంతం గుండా ప్రవహించే మూలవాగును దాటి వేములవాడకు చెందిన కొందరు వ్యక్తులు గురువారం చేపల వేటకు వెళ్లారు. వాగులో వరద ప్రవాహం పెరగడంతో అందులోనే చిక్కుకున్నారు. సదరు వ్యక్తులు తమను కాపాడాలని వేములవాడ పోలీసులకు ఫోన్ద్వారా సమాచారమందించారు. ఎస్సై మాలకొండ రాయుడు సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి తాళ్ల సహాయంతో వారిని ఒడ్డుకు చేర్చారు. మరో రెండుమూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మెదక్జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా ముసురు వర్షం కురుస్తూనే ఉంది. దీనికితోడు చల్లగాలులు వీస్తుండటంతో జనం ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. దీంతో పెద్దశంకరంపేటలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కొనేవారు లేక సంత వెలవెలబోయింది. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగాయి. నాగర్కర్నూల్జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. పలు వాగులు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరింది. పాలెం చెరువు, నాగర్కర్నూల్చెరువు నిండుకుండను తలపిస్తున్నాయి. పెద్దవాగు ఉధృతికి నాగర్కర్నూల్– బిజినేపల్లి మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు పాత ఇళ్లలో ఉండకూడదని, కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండాలని, వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.