Breaking News

కరోనా టెస్టుల కోసం బారులు

కరోనా టెస్టుల కోసం బారులు
  • 20 మందికి మాత్రమే నిర్ధారణ పరీక్షలు
  • నిరాశతో వెనుదిరుగుతున్న జనం
  • తాజాగా కొవిడ్​తో వృద్ధుడు మృతి,
  • అవసరమైన వారే టెస్టులు చేయించుకోండి: డీఎంహెచ్​వో వెంకటేశ్వర్​ రావు

సారథి, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ఓ వ్యక్తి(52) కరోనాతో బాధపడుతూ బుధవారం చనిపోయాడు. అతని పరిస్థితి విషమించడంతో స్థానిక ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రానికి ఆటోలో తీసుకొచ్చారు. ఆటోలోనే అతనికి వైద్యపరీక్షలు చేశారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో మెదక్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడికి చేరుకునేలోపే మార్గమధ్యంలోనే చనిపోయాడు. బుధవారం పెద్దశంకరంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద కరోనా టెస్టుల కోసం అధిక సంఖ్యలో జనం బారులుదీరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవలం 20 మందికి మాత్రమే కరోనా టెస్టులు చేస్తామని మండల వైద్యాధికారి పుష్పలత చెప్పడంతో మిగతావారు వెనుదిరిగారు. ఉదయం నుంచి వేచిచూస్తున్నా తమకు టెస్టులు ఎందుకు చేయడం లేదని కొందరు డాక్టర్లు, వైద్యసిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు నచ్చజెప్పడంతో వెనుదిరిగివెళ్లిపోయారు.

ప్రజలు భయపడొద్దు.. బయటికి రావొద్దు: డీఎంహెచ్​వో
కొవిడ్ –19 వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం యంత్రాంగం విశేషంగా కృషిచేస్తోందని మెదక్​ జిల్లా వైద్యాధికారి డాక్టర్​ వెంకటేశ్వర్​ రావు అన్నారు. బుధవారం పెద్దశంకరంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు మెదక్ జిల్లాలో ఒక లక్ష మందికి వ్యాక్సినేషన్ వేశామన్నారు. ప్రజలు కరోనా బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొవిడ్-19 నిర్ధారణ అయినవారు పౌష్టికాహారంతో పాటు పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, మాంసం, చికెన్, గుడ్లు తదితర పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. మెదక్ జిల్లాలో వ్యాక్సిన్ కొరత లేదన్నారు.

మెదక్ లో 50, నర్సాపూర్​ లో 30 ఆక్సిజన్​ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారు మాత్రమే కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని ఆయన సూచించారు. పాజిటివ్ వచ్చినవారు కచ్చితంగా 14 రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని ఆయన సూచించారు. జిల్లాలో ప్రతిరోజు వెయ్యి మందికి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని 8వేల కిట్లు అందుబాటులో ఉన్నాయని డీఎంహెచ్​వో వివరించారు. ప్రజలు కరోనాకు భయపడి ప్రైవేట్​ ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ దవాఖానలోని ట్రీట్​మెంట్​ తీసుకోవాలని కోరారు. మెదక్​ జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్​ ప్రక్రియను పూర్తిచేస్తామన్నారు. జిల్లాలోని 24 కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. ఆయన వెంట రామాయంపేట మండల వైద్యాధికారి పుష్పలత, సీహెచ్ సీ సిబ్బంది భూమయ్య, సాయిలు, వెంకటేశం, శివప్రసాద్ ఉన్నారు.