Breaking News

మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాలి

మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాలి

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: జిల్లాలో పెండింగ్​లో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రామయ్య డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం, సీఐటీయూల ఆధ్వర్యంలో కలెక్టరేట్​లో జూనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 20  మండలాల్లో  కార్మికులకు గత మూడు నెలల నుంచి బిల్లులు రాక తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. మరొకవైపు కరోనా కారణంగా పాఠశాలల మూతపడి మధ్యాహ్న భోజన కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు. కమీషన్లు పెంచడం, వేతనాలు ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ స్కూళ్లలో వంటగదులు సరిగ్గా లేక, వండటానికి సరైన సామగ్రి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, ప్రభుత్వం నుంచి బిల్లులు రాకున్నా  పిల్లల ఆకలి తీర్చడానికి వంట చేసి పెడుతున్నారన్నారు. అక్షయ పాత్ర పేరుతో ప్రైవేటు యాజమాన్యాలకు అప్పజెప్పడం వల్ల విద్యార్థులు నాణ్యమైన తిండి తిన లేకపోతున్నారన్నారు. తమిళనాడు, కేరళ తరహాలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు కొంపల్లి అశోక్, మధ్యాహ్న భోజన కార్మికులు రామకృష్ణమ్మ, కృష్ణయ్య, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.