- కనీసం గుజరాత్ నేతల మాటలనైనా వినండి
- కేంద్రానికి మంత్రి కేటీఆర్వినతి
సామాజికసారథి, హైదరాబాద్: చేనేతపై జీఎస్టీ పెంపును మంత్రి కె.తారక రామారావు మరోసారి తనదైనశైలిలో స్పందించారు. ఇది వస్త్ర పరిశ్రమకు మరణశాసనమే అవుతుందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు. చేనేతపై జీఎస్టీ విషయంలో తమ విన్నపాన్ని పట్టించుకోకపోయినా కనీసం గుజరాత్ వాణి అయినా వినాలని పీయూష్ గోయల్‌ను కోరారు. కేంద్ర టెక్స్‌టైల్ శాఖ సహాయ మంత్రి దర్శనాజర్దోష్‌తో పాటు గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు కూడా జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారని ట్వీట్ లో ఉటంకించారు. వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని ఏడు శాతానికి పెంచుతూ ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని పీయూష్ గోయల్‌కు మంత్రి కేటీఆర్ ఇంతకుముందే లేఖ రాశారు. దేశ చరిత్రలో ఏనాడూ చేనేత ఉత్పత్తులపైన పన్ను లేదని కేంద్రం జీఎస్టీ ద్వారా మొదటిసారి ఐదుశాతం విధించినప్పుడే తీవ్ర వ్యతిరేకత ఎదురైనట్లు లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ మరో ఏడుశాతం విధించడం సబబు కాదని, ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ‘మేకిన్ ఇండియా’ అంటూ రోజూ ఉపన్యాసాలు ఇచ్చే కేంద్రం స్వదేశంలో వస్త్రాలు తయారుచేసే పరిశ్రమకు సహకారం అందించాల్సింది పోయి జీఎస్టీని ఐదునుంచి 12 శాతానికి పెంచారని వ్యాఖ్యానించారు.