- గుండెపోటు నివారణకు అత్యవసర మెడిసిన్
- ఉచితంగా అందిస్తామన్న అదనపు ఈవో ధర్మారెడ్డి
తిరుమల: శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చే భక్తులకు రుయా ఆస్పత్రి శుభవార్త చెప్పింది. అత్యవసర వైద్యం అవసరమైన పక్షంలో గుండెపోటు నుండి రక్షించేందుకు తిరుపతిలోని రుయా ఆసుపత్రివారి ఆధ్వర్యంలో టెనెక్టేస్ ప్లస్ ఇంజక్షన్ అందుబాటులోకి తెచ్చింది. శనివారం తిరుమలలోని రాంభగీచా గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న ప్రథమ చికిత్స కేంద్రంలో అదనపు ఈవో ధర్మారెడ్డి ఈ మెడిసిన్‌ను విడుదల చేశారు. గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం లాంటి సమస్యల కారణంగా గుండెపోటు వచ్చినప్పుడు ఈ ఇంజక్షన్ వేస్తే ప్రాణాలు కాపాడొచ్చని వైద్యులు ఇచ్చిన సలహా మేరకు భక్తులకు అందుబాటులో ఉంచామన్నారు. దక్షిణ భారతదేశంలో రుయా ఆసుపత్రికి మాత్రమే ఈ ప్రాజెక్టు మంజూరైందని, తిరుపతి కేంద్రంగా చుట్టుపక్కల 13 ప్రాంతాల్లో ఈ ఇంజక్షన్ అందుబాటులో ఉంటుందని ఆయన వెల్లడించారు. మార్కెట్‌లో దీని ధర రూ.35 వేల నుండి 40 వేల వరకు ఉంటుందని, రుయా ఆసుపత్రిలో మాత్రం ఉచితంగా అందిస్తారని ధర్మారెడ్డి వెల్లడించారు.