Breaking News

ఎంతకాలం బతికామన్నది కాదు…

ఎంత కాలం బతికామన్నది కాదు...

  • జన్మనిచ్చిన ఊరుకు సేవ చేయడం అదృష్టం
  • ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి అభినందనీయం
  • విద్యాయజ్ఞంలో భాగస్వాములు కావాలి: మంత్రి కేటీఆర్​

సామాజిక సారథి, తిమ్మాజీపేట: జన్మనిచ్చిన ఊరుకు సేవ చేయడం ఎంతో అదృష్టమని, అందులో పాఠశాలలను నిర్మించి విద్యాభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని మున్సిపల్​శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో ఏ కార్పొరేట్ స్కూలులో లేని విధంగా తిమ్మాజీపేట జెడ్పీహెచ్ఎస్​ను సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ధి ఇచ్చినందుకు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డిని, ఎంజేఆర్​ ట్రస్టును మంత్రి కేటీఆర్ ​అభినందించారు. శుక్రవారం ఎంజేఆర్ ట్రస్ట్​ తరఫున నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేటలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ హైస్కూలును ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మనం ఎంత కాలం బతికాము అనేది ముఖ్యం కాదని, ఎలా బతికాము, ఎంత మందికి సహాయపడ్డామనేది ముఖ్యమని పేర్కొన్నారు.

ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన మర్రి జనార్దన్ రెడ్డి కష్టపడి సంపాదించి నేడు వేలమందికి ఉపాధి కల్పిస్తూ పారిశ్రామికవేత్తగా వెలుగొందటంతో పాటు తన జన్మభూమి రుణం తీర్చుకోడానికి రూ.మూడు కోట్ల పైచిలుకు ఖర్చుతో కార్పొరేట్ స్కూలును మించి నిర్మించి ఇవ్వడం అభినందనీయమన్నారు. అలాగే నాగర్ కర్నూల్ సిర్సవాడ, తాడూరులో మరో రెండు స్కూళ్లను నిర్మించి ఇచ్చేందుకు శంకుస్థాపన చేయడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఆర్థికంగా ఉన్నత శిఖరాలకు చేరినవారు, ప్రవాసంలో ఉన్న వారు సాధ్యమైనంత మేరకు సహాయం అందించాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లా అంటే వలస జిల్లా అని, నేడు ఇతర రాష్ట్రాల నుంచి ఇదేజిల్లాకు వలస వస్తున్నారని వెల్లడించారు. ఒక్కో విద్యార్థికి 1.25 లక్షలు సంవత్సరానికి ఖర్చు చేసి చదివించడం వల్ల గురుకుల విద్యార్థులు దేశంలోని అన్ని పోటీ పరీక్షల్లో ముందుంటున్నారని పేర్కొన్నారు. అభివృద్ధిలో పరుగులు పెడుతున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో 157 మెడికల్ ​కాలేజీలను మంజూరుచేస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. రేపు రాష్ట్రానికి సమతామూర్తి విగ్రహాం ప్రారంభిత్సవానికి విచ్చేస్తున్న ప్రధాని మోడీకి రామానుజుల వారు కలలో వెళ్లి అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేసే విధంగా ఉపదేశించాలని కోరారు.

మన ఊరు.. మన బడి స్ఫూర్తి
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మన ఊరు మన బడి కార్యక్రమం తమనకు స్ఫూర్తినిచ్చిందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. దేశ భవిష్యత్​ పౌరులపై ఆధారపడి ఉందని, ఎన్ని కోట్లు సంపాదించిన ఉన్నత విద్యను సంపాదించ లేకపోయిన తాను ప్రతి పేద విద్యార్థికి కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే కోరికతో తిమ్మాజిపేటలో ప్రభుత్వ పాఠశాలను ట్రస్టు ద్వారా నిర్మించినట్లు తెలిపారు. నేడు శంకుస్థాపన చేసిన సిర్సవాడ, తాడూరు స్కూళ్లను ఏడాదిలోగా మంత్రి కేటీఆర్​చేతులమీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. తాను నిధులు ఇచ్చినా ఎంజేఆర్ ట్రస్ట్ డైరెక్టర్ జమున జనార్దన్ రెడ్డి దగ్గరుండి ఏ లోటు లేకుండా భవనం నిర్మాణం చేయించారన్నారు. మాటల కన్నా చేతలు మిన్న అనే సిద్ధాంతం.. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో విద్యాలయాలు నిర్మించి రుణం తీర్చుకునే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. రైతులు కొనుగోలు చేసిన హిటాచీ, టిప్పర్లను కూడా మంత్రి కేటీఆర్​ప్రారంభించారు. అంతకుముందు మంత్రి కేటీఆర్ ​అంబేద్కర్ ​విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమం అనంతరం ఆయన విద్యార్థులు, మంత్రులతో కలిసి భోజనాలు చేశారు.