- నల్లగొండలో టీఆర్ఎస్ కార్యకర్తల నిరసన
- గులాబీ, కమలం శ్రేణుల బాహాబాహీ
- ఇరుపార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లదాడి
- ధాన్యం కుప్పలపై పరుగులు.. చెల్లాచెదురైన వడ్లు
సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలనలో భాగంగా సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని ఆర్జాలబావి ఐకేపీ సెంటర్కు చేరుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘బండి సంజయ్ గో బ్యాక్!’ అంటూ పెద్దపెట్టున టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ ఆర్జాలబావి ఐకేపీ సెంటర్ కు చేరుకోకముందే, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడికి తరలివచ్చారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలు పరస్పరం ఘర్షణకు దిగారు. ఆయన రైతులతో మాట్లాడుతుండగానే టీఆర్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు రాళ్లు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో అప్పటివరకు ధాన్యం కుప్పల వద్ద పనిచేసుకుంటున్న రైతులు, మహిళలు భయాందోళనకు గురై అర్ధాంతరంగా పనులు ముగించుకుని సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లారు. వందలాది మంది కార్యకర్తలు ధాన్యం కుప్పలపై పరుగులు తీస్తుండటంతో గింజలు చెల్లాచెదురయ్యాయి.
తాటాకు చప్పుళ్లకు భయపడం: బండి సంజయ్
ఐకేపీ సెంటర్ వద్ద ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతుల పట్ల గజినీగా మారి, ఒకసారి పత్తి వేయమంటారు, మరోసారి ధాన్యం వేయాలని, ఇంకోసారి వరివేస్తే ఉరే అని రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో ప్రతి గింజను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారని, ఆయన మాటలు నమ్మి రైతులు వరిసాగు చేస్తే రైతులు కళ్లాల వద్ద పడిగాపులు గాస్తున్నారని అన్నారు. రైతుల బాధలు తెలసుకునేందుకు నల్లగొండ జిల్లాలో పర్యటించబోతున్నామని, ముందుగానే షెడ్యూల్ ఇచ్చారని, పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ విఫలమయ్యారని ఆరోపించారు. తాటాకు చప్పుళ్లకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. కోడిగుడ్లు, రాళ్లు చెప్పులతో దాడులు చేస్తే, రాత్రింబవళ్లు కల్లాల వద్ద పడిగాపులు గాస్తున్న రైతులకు తగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రూ.1,800 ఉన్న మద్దతు ధరను కేంద్రం రూ.1,960కి పెంచిందని గుర్తుచేశారు. రైతుల కోసం రాళ్ల దాడికైనా, బూతులు తిట్టినా సహిస్తామని చెప్పారు.